Telangana Congress: తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. గతంలో జరిగిన ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి అభ్యర్థుల ఎంపికలో పీసీసీ కీలక మార్పులు చేస్తోంది. గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకు పటిష్టమైన స్క్రీనింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. పీసీసీ నుంచి తాజాగా అందిన ఆదేశాల మేరకు, డీసీసీలు అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించనున్నాయి.
పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన నాయకుల పూర్తి వివరాలను, వారి విజయాల చరిత్రను సేకరించాలని డీసీసీలకు పీసీసీ ఆదేశించింది. ప్రతి జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను పరిశీలించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలు అభ్యర్థులపై ఉన్న ప్రజాభిప్రాయం, వారి బలాబలాలపై నివేదికలను పరిశీలిస్తాయి. కేవలం డబ్బు, పలుకుబడి ఉన్నవారికంటే, ప్రజల్లో పట్టున్న కార్యకర్తలకే ప్రాధాన్యత ఇవ్వాలనేది పీసీసీ లక్ష్యం.
Also Read: Telangana Congress: కాంగ్రెస్ ఉప ఎన్నికల వ్యూహం.. సీఎం రేవంత్ రెడ్డి నయా స్ట్రాటజీ!
కీలక బాధ్యతలు
గ్రామస్థాయిలో పార్టీ పట్టును పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వినూత్న వ్యూహాన్ని అమలు చేయనుంది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ మద్దతుదారులు, పార్టీకి చెందిన సర్పంచులకు వారి పరిధిలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలను పార్టీ అప్పగించే అవకాశం ఉన్నది. సర్పంచులు తమ పరిధిలో పోల్ మేనేజ్‌మెంట్, బూత్ స్థాయి కార్యకలాపాలను పర్యవేక్షించడంలో క్రియాశీలక పాత్ర పోషించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో కమిటీలు
ఎన్నికల రోజున ఓటింగ్ ప్రక్రియను పటిష్టంగా నిర్వహించేందుకు, కాంగ్రెస్ బూత్ స్థాయి నుంచి కట్టుదిట్టమైన వ్యవస్థను రూపొందించాలని నిర్ణయించింది. ప్రతి పోలింగ్ బూత్‌కు ప్రత్యేకించి బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలని పీసీసీ దిశానిర్దేశం చేసింది. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో అత్యంత క్రియాశీలకమైన ఐదుగురు సభ్యులతో కూడిన పోల్ మేనేజ్‌మెంట్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. వీరు ఎన్నికల వ్యూహాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. పటిష్టమైన అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయిలో పటిష్టమైన నిర్వహణ వ్యవస్థ ద్వారా గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవాలని పీసీసీ లక్ష్యంగా పెట్టుకున్నది.

