GHMC Council: వాడివేడిగా కౌన్సిల్ సమావేశం
GHMC Council ( image credit: swetcha reporter)
Telangana News

GHMC Council: వాడివేడిగా కౌన్సిల్ సమావేశం.. పార్టీలకతీతంగా పునర్విభజనపై సభ్యుల ప్రశ్నల వర్షం!

GHMC Council: గ్రేటర్ బయట, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో అనివార్యమైన జీహెచ్ఎంసీ(GHMC)  మున్సిపల్ వార్డుల డీలిమిటేషన్‌పై సాధారణ ప్రజలతో పాటు పాలక మండలిలో సభ్యులైన వివిధ పార్టీలకు చెందిన కార్పొరేటర్లు సైతం ఎన్నో సందేహాలను వ్యక్తం చేశారు. ప్రస్తుతం వార్డుల డీలిమిటేషన్ అభ్యంతరాల స్వీకరణ దశలో ఉన్నందున పాలక మండలి అభ్యంతరాలను కూడా స్వీకరించేందుకు మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ స్పెషల్ మీటింగ్‌లో అధికార విపక్షాలంటూ తేడా లేకుండా కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు సైతం తీవ్ర స్థాయిలో అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభం కావల్సిన మీటింగ్ 20 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది.

జీహెచ్ఎంసీ పరిధిలో 300 వార్డులను ఫిక్స్

మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షత ప్రారంభమైన సమావేశంలో తొలుత కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ మాట్లాడారు. పట్టణ స్థానిక సంస్థల విలీనంతో 650 చదరపు కిలోమీటర్ల వరకు ఉన్న విస్తీర్ణం సుమారు 2,050 కిలోమీటర్లకు పెరిగిందిని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 300 వార్డులను ఫిక్స్ చేసేందుకు వార్డుల పునర్విభజనకు సంబంధించి సర్కారు ఇచ్చిన ఆదేశాల మేరకు శాస్త్రీయంగా పునర్విభజన చేశామని తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి 7 రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తున్నామని తెలిపారు. ఒక్కో వార్డుకు నలుదిక్కుల సరిహద్దులను ఫిక్స్ చేస్తూ 45 వేల జనాభాను ప్రామాణికంగా తీసుకుని, 10 శాతం తక్కువ, ఎక్కువతో డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేసి డ్రాఫ్ట్‌పై అభ్యంతరాలను స్వీకరిస్తున్నామని వెల్లడించారు. పునర్విభజన ప్రక్రియలో పాటించిన పలు నియమ, నిబంధనలతో పాటు జాగ్రత్తలను కమిషనర్ సభకు వివరించారు.

కనీసం మీకైనా సమాచారం ఉందా?.. మేయర్‌కు తలసాని ప్రశ్న

మేయర్ ఆదేశం మేరకు ఎక్స్ అఫీషియో సభ్యుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, పట్టణ స్థానిక సంస్థల విలీనం, జీహెచ్ఎంసీ వార్డు పునర్విభజనను సర్కారు హఠాత్తుగా చేపట్టిందని, ఈ విషయంపై కనీసం మేయర్ కైనా సమాచారం ఉందా అని ప్రశ్నించారు. దీనిపై మేయర్ తనకు సమాచారం లేదన్నట్టుగానే తల ఊపడంతో సభలో కాసేపు గందరగోళం నెలకొన్నది. పాత జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డులకు సరిపోయే సేవలందించే సిబ్బంది లేకపోగా, కొత్తగా 300 వార్డులుగా పునర్విభజించడం సరికాదన్నారు. ప్రజలను సంప్రదించుకుండానే, అభిప్రాయాలు స్వీకరించకుండానే చేశారన్నారు.

విలీనం చేసిన సంస్థల యాక్షన్ ప్లాన్ ఏంటి?

ఎందుకు ప్రజలను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయలేదని ప్రశ్నించారు. పునర్విభజనపై ఫిజికల్ సర్వే నిర్వహించి, కౌన్సిల్‌లో ఓటింగ్ నిర్వహించాలని సూచించారు. బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ, సుమారు లక్ష పైగా జనాభా ఉన్న అమీన్ పూర్‌ను కేవలం రెండు వార్డులుగా విభజించారన్నారు. మరో రెండు వార్డులు పెంచాలని, ఇందుకు అవసరమైతే ఆఖిల పక్ష కమిటీని నియమించాలని కోరారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ, విలీనం చేసిన సంస్థల యాక్షన్ ప్లాన్ ఏంటి? అదనంగా ఏమైనా బడ్జెట్ కేటాయించారా అని ప్రశ్నించారు. కౌన్సిల్ సభ్యులందరితో డీలిమిటేషన్‌పై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ, గతంలో వార్డులను పునర్విభజించినప్పుడు ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించకుండానే ప్రక్రియ ముగించారని ఇప్పుడు డీలిమిటేషన్‌పై చిన్న చిన్న తప్పులు జరిగి ఉండవచ్చునని సభ్యులంతా పొలిటికల్ ఇంట్రెస్ట్ వదిలి, మద్దతునిన్వాలని తాను మాత్రం పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.

Also ReadGHMC Council Meeting: మనం రౌడీలమా? ప్రజాప్రతినిధులమా?.. కార్పొరేటర్లపై జీహెచ్ఎంసీ మేయర్ ఆగ్రహం

పునర్విభజన ప్రక్రియలో జోక్యం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, పునర్విభజన చేసేందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎవరు అని ప్రశ్నించారు. ఓ అడ్వైజరీ బోర్డు పునర్విభజన ప్రక్రియలో జోక్యం చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తూ తాము ఈ వార్డుల పునర్విభజనను వ్యతిరేకిస్తున్నట్లు ప్రక్రటించారు. కాంగ్రెస్ సభ్యులు జోక్యం చేసుకోగా, మేయర్ వారిని వారించారు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో బీజేపీ కార్పొరేటర్లు పునర్విభజనకు సంబంధించి గెజిట్‌ను కౌన్సిల్‌లో చింపివేయడంతో కాస్త గందరగోళ వాతావరణం నెలకొన్నది. దీంతో సభను మేయర్ విజయలక్ష్మి నరవధిక వాయిదా వేశారు. 126 కార్పొరేటర్లు, మరో 26 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు హాజరైన ఈ సభలో పునర్విభజనపై మొత్తం 61 మంది సభ్యులు తమ అభ్యంతరాలను వెల్లడించారు. కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు కొందరు మినహా మిగిలిన వారంతా పునర్విభజనను స్వాగతిస్తున్నామని స్పష్టం చేయగా, బీఆర్ఎస్, బీజేపీ వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించాయి.

మీ సీట్లు పెరుగుతున్నాయని ప్రశ్నించడం లేదా?

వార్డుల పునర్విభజనతో ఎంఐఎం సీట్లు పెరుగుతున్నందున మీరు పునర్విభజనపై మాట్లాడడం లేదని బీజేపీ ఫ్లోర్ లీడల్ శంకర్ యాదవ్ కౌన్సిల్‌లో వ్యాఖ్యానించగా, ఎంఐఎం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ, ఎంఐఎం సభ్యుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకున్నది. దీంతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జోక్యం చేసుకుని డీలిమిటేషన్ అభ్యంతరాలను తెల్సుకునేందుకు కౌన్సిల్ నిర్వహిస్తున్నామని, ఈ సమావేశంలో పార్టీల పేర్లు ప్రస్తావించొద్దని సూచించారు. పునర్విభజన ఎంఐఎం కోసమేనన్న విషయాన్ని తాము రుజువు చేస్తామని, లేని పక్షంలో కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తానని శంకర్ యాదవ్ సవాల్ విసిరారు. వార్డుల డీలిమిటేషన్‌పై ప్రత్యేకంగా కమిటీని నియమించాల్సిన అవసరమున్నదని శంకర్ యాదవ్ మేయర్‌ను కోరారు. జనాభా, ఓటర్ల సంఖ్యను ఇష్టారాజ్యంగా తీసుకుని డీలిమిటేషన్ చేశారన్నారు. ఒక్కో డివిజన్‌లో 15 వేల మంది జనాభా ఉండగా, మరికొన్నింటిలో ఏకంగా 65 వేల జనాభాతో పునర్విభజించారని, ఇదెలా సాధ్యమని శంకర్ యాదవ్ ప్రశ్నించారు.

సభ్యుల భిన్నాప్రాయాలు

వార్డుల పునర్విభజన విషయంలో కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు రకరకాలుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. గతంలో జరిగిన మీటింగ్‌ల కన్నా మంగళవారం జరిగిన కౌన్సిల్ కాస్త ప్రశాంతంగా జరగడంతో ఎక్కువ మంది సభ్యులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నగర విస్తీర్ణాన్ని విస్తరిస్తున్నారని, పునర్విభజనపై తీవ్ర స్థాయిలో అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. విలీనం చేసిన పట్టణ స్థానిక సంస్థలను మరి కొంతకాలం అలాగే కొనసాగించి భవిష్యత్ అవసరాలను బట్టి విలీనం, పునర్విభజన ప్రక్రియ చేపట్టాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు.

సభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి, తోకల శ్రీనివాస్ రెడ్డి, బొంతు శ్రీదేవి, విజయా రెడ్డి, స్వామి, రవీందర్‌లు మాట్లాడుతూ, తమ డివిజన్ల రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయని, ఇరుకు పొరుగు వార్డుల ప్రాంతాలను ఇష్టారాజ్యంగా తమ వార్డులలో కలిపేశారని, గందరగోళంగా పెట్టారని ప్రశ్నల వర్షం కురిపించారు. డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ కూడా పూర్తిగా మారిపోయిందని, విలీనం, పునర్విభజనకు సంబంధించి తనకు, మేయర్‌కు కాస్త ముందస్తు సమాచారమున్నదని వ్యాఖ్యానించడంతో బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు జోక్యం చేసుకుని మేయర్ సమాచారం లేదన్నారని, మీరు ఉందంటున్నారని ప్రశ్నించగా, పత్రికల్లో కథనాలు చదివానని డిప్యూటీ మేయర్ సమాధానమిచ్చారు.

Also Read: GHMC Council Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటిలో రసాభాస.. బీజేపీ, మజ్లిస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం

Just In

01

Singareni: ఒడిశాలో సింగరేణి మెగా ప్రాజెక్టులు.. ఐపీఐసీఓఎల్‌తో 18న కీలక ఒప్పందం!

BJP Telangana: సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ హవా.. స్టేట్ వైడ్‌గా గతం కంటే పెరిగిన స్థానాలు!

Ponnam Prabhakar: ఉపాధి హామీ పథకం లో గాంధీ పేరు తొలగింపు దుర్మార్గం.. కేంద్రంపై మంత్రి పొన్నం ఫైర్!

Avatar Fire and Ash: రాజమౌళి రేంజ్ చూశారా.. ‘అవతార్: ఫైర్ అండ్ ఆష్’పై జేమ్స్ కామెరాన్‌తో ఆసక్తికర చర్చ..

Telangana Congress: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కాంగ్రెస్ వ్యూహం.. అభ్యర్థుల ఎంపికకు ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీలు!