Delhi Government: దేశ రాజధానిలో వాయు కాలుష్యం నానాటికి పెరిగిపోతున్న వేళ.. దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘పొల్యూషన్ అండర్ కంట్రోల్’ (PUC) సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ప్రవేశాన్ని నిషేధించింది. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన దిల్లీ పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ (Manjinder Singh Sirsa).. డిసెంబర్ 18 నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఈ నిబంధన అమలును కెమెరా ఆధారిత వ్యవస్థలు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తాయని ఆయన వెల్లడించారు.
సిటీలోకి రాకుడం నిషేధం
గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)-IVలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు దిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణలో అత్యంత కఠిన స్థాయిగా అభివర్ణించే GRAP–IV నుంచి ఈ నిబంధన అమలు చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు BS-VI ప్రమాణాల కంటే తక్కువ ప్రమాణాలు ఉన్న ఢిల్లీయేతర (నాన్-ఢిల్లీ) ప్రైవేట్ వాహనాలను నగరంలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ ఆంక్షలు కూడా డిసెంబర్ 18 నుంచి అమల్లోకి వస్తుందని తేల్చిచెప్పారు. మరోవైపు నగరంలో జరిగే నిర్మాణ పనులపైనా పూర్తిస్థాయి నిషేధం అమల్లో ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
8000 పరిశ్రమలపై ఆంక్షలు
అయితే దిల్లీలో పెరిగిపోతున్న గాలి కాలుష్యానికి గత ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వమే కారణమని మంత్రి మంజిందర్ సింగ్ ఆరోపించారు. ‘కాలుష్యమనే వ్యాధిని మేము గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా పొందాం. కాలుష్యాన్ని వ్యాపింపజేసినవారే ఇప్పుడు నిరసనలు చేస్తున్నారు’ అని ఆయన విమర్శించారు. ఇప్పటివరకూ తమ ప్రభుత్వం తీసుకున్న కాలుష్య నియంత్రణ చర్యలను సైతం మంజిందర్ సింగ్ తెలియజేశారు. ల్యాండ్‌ఫిల్ ప్రాంతాల ఎత్తును 15 మీటర్లు తగ్గించినట్లు తెలిపారు. దాదాపు 8,000 పరిశ్రమలను కఠినమైన కాలుష్య నియంత్రణ నిబంధనల కిందకు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. కాలుష్యానికి కారణమైన పరిశ్రమలపై రూ.కోట్లల్లో జరిమానాలు విధించినట్లు చెప్పారు.
Also Read: West Bengal Sports Minister: మెస్సీ ఈవెంట్ ఎఫెక్ట్.. క్రీడల మంత్రి రాజీనామా.. ఆమోదించిన సీఎం
దిల్లీ ప్రజలకు క్షమాపణలు: మంత్రి
కట్టెలు కాల్చడం వల్ల వచ్చే ఉద్గారాలను తగ్గించేందుకు 10,000 హీటర్లను ప్రభుత్వం తరపున పంపిణీ చేసినట్లు పర్యావరణ మంత్రి తెలిపారు. అలాగే బంకెట్ హాళ్లలో డీజేల వినియోగాన్ని నియంత్రించాలని ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. అలాగే నిర్మాణ సామగ్రిని దిల్లీలోకి తరలించడాన్ని నిషేధించామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం దిల్లీలో గాలి నాణ్యత నెల నెలా మెరుగుపడుతోందని మంత్రి పేర్కొన్నారు. అయితే షార్ట్ టైమ్ లో కాలుష్యాన్ని పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాదని మంజిందర్ సింగ్ అంగీకరించారు. ఇందుకు గాను దిల్లీ ప్రజలకు క్షమాపణలు బహిరంగ క్షమాపణలు చెప్పారు. 7-8 నెలల్లో కాలుష్యాన్ని పూర్తిగా అదుపులోకి తేవడం అసాధ్యమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

