Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. బుధవారం జరగనున్న మూడో విడుత ఎన్నికలపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పూర్తి దృష్టి సారించాయి. ఈ విడుతలో సత్తా చాటి, రాబోయే కాలంలో ప్రజాదరణ తమకే ఉందని ప్రచార అస్త్రంగా మార్చుకోవాలని పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.
కాంగ్రెస్ దూకుడు
మొదటి రెండు విడుతల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది. మొత్తం 5,275 గ్రామపంచాయతీలను హస్తం పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. ఇదే దూకుడును కొనసాగించి, మూడో విడుతలోనూ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది.
బీఆర్‌ఎస్‌కు ప్రతిష్ఠాత్మకం
మొదటి రెండు విడుతల్లో ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదనే అభిప్రాయంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ, మూడో విడుతపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఈ విడుతలో కనీసం 2 వేల మార్కు దాటాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే గెలిచిన సర్పంచులకు సన్మాన కార్యక్రమాలను నిర్వహించి, కేడర్‌లో భరోసా కల్పిస్తున్నారు. రాబోయే కాలంలో బీఆర్‌ఎస్సే అధికారంలోకి వస్తుందని, ఈ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని పార్టీ ప్రచారం చేస్తుంది. ఎన్నికల్లో దాడులు జరిగిన పార్టీ కార్యకర్తలను పరామర్శించడం, లీగల్ టీమ్‌లను ఏర్పాటు చేసి కేసుల వాదనకు ఏర్పాట్లు చేయడం ద్వారా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు.
బీజేపీ పరువు పందెం
అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకున్నప్పటికీ, పంచాయతీ ఎన్నికల్లో ఆ స్థాయిలో విజయం సాధించడంలో బీజేపీ వెనుకబడింది. మొదటి రెండు విడుతల్లో కేవలం 453 స్థానాల్లోనే విజయం సాధించడంతో, ఈ మూడో విడుతలోనైనా వెయ్యి మార్కు దాటాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది.
ఎత్తులు పైఎత్తులు
పోలింగ్‌కు ఒక్కరోజే గడువు ఉండడంతో, విజయం కోసం గ్రామాల్లో పార్టీ మద్దతుదారులు ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నారు. ప్రత్యర్థి ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బులు, మద్యం, మహిళలకు చీరలు సైతం పంపిణీ చేస్తున్నారు. ఆయా పార్టీ అధిష్టానాలు సైతం గ్రామాల నేతలను మానిటరింగ్ చేస్తూ, గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచనలు, సలహాలు ఇస్తున్నాయి. మూడో విడుతలో 3,752 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, ఈ విడుతలో అధికార కాంగ్రెస్ హవా కొనసాగిస్తుందా, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మెజారిటీ స్థానాలు సాధిస్తుందా, లేక బీజేపీ పుంజుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: Panchayat Elections: ఓట్ల పండుగకు పోటెత్తుతున్న ఓటర్లు.. పల్లెల్లో రాజకీయ వాతావరణం

