Ramchander Rao: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఎన్నికల కమిషన్‌ను బెదిరిస్తున్నారని, వ్యక్తుల పేర్లు తీసుకుని బెదిరించడం బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా సోమవారం ఆయన నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను కాంగ్రెస్ మరిచిపోయిందని, రాజ్యాంగాన్ని కాలరాసిన వాళ్లను మాత్రమే కాంగ్రెస్ గుర్తుపెట్టుకుంటుందని విమర్శించారు. కాంగ్రెస్ రాజ్యాంగంపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని చురకలంటించారు.
బంగ్లాదేశ్ అంటే కాంగ్రెస్‌కు ఎందుకంత ప్రేమ
ఓట్ చోరీ పేరుతో కాంగ్రెస్ నాటకాలాడుతోందని ఫైరయ్యారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంటే కాంగ్రెస్‌కు ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు. అక్రమ చొరబాటుదారుల ఓట్లు తొలగిస్తామంటే వారికి ఎందుకు ఇబ్బంది అని నిలదీశారు. కులం, మతం, పేరుతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ఇలాంటి రాజకీయాలు మానుకోవాలన్నారు. లేకపోతే ఇప్పుడున్న మూడు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ అధికారం కోల్పోవడం ఖాయమని రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. సర్పంచ్ ఎన్నికల్లో అనేక వార్డులు, సర్పంచ్ సీట్లను బీజేపీ కైవసం చేసుకుందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బెదిరింపులకు పాల్పడిందని విమర్శించారు. మూడో విడతలోనూ బీజేపీ మంచి సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
విలీనంపై కార్పొరేటర్లు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో రాంచందర్ రావు భేటీ అయ్యారు. డీలిమిటేషన్, 300 స్థానాలకు పెంపు, కార్పొరేషన్ల విలీనంపై కార్పొరేటర్లు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.జీహెచ్ఎంసీ కార్యాలయంలో జరిగే కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై రాంచందర్ రావు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు దిశా నిర్దేశం చేశారు. మున్సిపాలిటీల విలీనం, డివిజన్ల పెంపు, ఏ ప్రాతిపాదికన నిర్ణయించారో చెప్పాలని డిమాండ్ చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఆదరబాదరగా విలీనం చేయడం వెనుక ఆంతర్యమేంటి అన్నదానిపై పోరాటం ఉధృతం చేయాలని కార్పొరేటర్లకు రాంచందర్ పిలుపునిచ్చారు. అభిప్రాయ సేకరణకు మరింత గడువు పెంచాలని డిమాండ్ చేయాలని సూచించారు. అన్ని పార్టీలతో అఖిలపక్షం ఏర్పాటు చేయాలని, అఖిలపక్షం నేతృత్వంలోనే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేలా ప్రశ్నించాలని సూచించారు. 300 డివిజన్లుగా చేసి, జీహెచ్ఎంసీని ఎన్ని విభాగాలు చేస్తారో క్లారిటీ ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు.
Also Read: Ramchander Rao: ఫ్యూచర్ సిటీకి కేంద్ర నిధులు ఎందుకు? ప్రభుత్వం కనీసం ఆలోచించిందా? : రాంచందర్ రావు

