Minister Seethakka: పేదల పొట్ట కొట్టడమే కేంద్రం ఉద్దేశం
పేదలు, రాష్ట్రాలను శిక్షించేలా నూతన బిల్లు
కేంద్రం తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి: మంత్రి సీతక్క
తెలంగాణ బ్యూరో, స్వేచ్చ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) పేరునే కాకుండా, దాని ఆత్మ, అమలు విధానాన్ని మార్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మంత్రి సీతక్క (Minister Seethakka) విమర్శించారు. సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా కల్పించాలనే మహాత్మా గాంధీ ఆలోచనలకు విరుద్ధంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటున్న దని, ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర విధానం పేదలు, రాష్ట్రాలను శిక్షించేలా ఉందని ఆక్షేపించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్)’ (వీబీ – గ్రామీణ్)గా మార్చే బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టాలనే యోచనను మంత్రి సీతక్క తప్పుబట్టారు.
గ్రామీణ పేదలకు జీవనోపాధి భద్రత కల్పించడం, వలసలను తగ్గించడం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిని సాధించడం వంటి గొప్ప లక్ష్యాలతో నాడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని ఆమె పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చారిత్రక పథకాన్ని నిర్వీర్యం చేయాలనే దురుద్దేశంతోనే కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని సీతక్క మండిపడ్డారు. గతంలో వందశాతం నిధులు వెచ్చిస్తూ పథకాన్ని అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు తన వాటాను 60 శాతానికి తగ్గించి, మిగిలిన 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపడం అన్యాయమన్నారు. ఇది రాష్ట్రాల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయమని, కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నమేనని విమర్శించారు. పథకం పేరులో నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడం ద్వారా గాంధీజీ ఆలోచనలు, విలువల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేక వైఖరి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మొదటి నుంచే ఈ పథకం నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇష్టం లేదని, అందుకే దశలవారీగా బలహీనపరిచే కుట్రలకు తెరలేపుతోందని ఆరోపించారు.
Read Also- India Russia Trade: భారత్–రష్యా వాణిజ్యంలో కొత్త మలుపు.. 300 ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలు
చట్టం ప్రకారం ప్రతి గ్రామీణ పేద కుటుంబానికి వంద రోజుల ఉపాధి కల్పించాల్సి ఉన్నా.., బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలోనూ 42 రోజులకన్నా ఎక్కువ పనిదినాలు కల్పించలేదన్నారు. ఈ పథకానికి ప్రతి ఏడాది నిధుల్లో భారీ కోత విధిస్తూ పేదల ఉపాధి హక్కును కేంద్రం కాలరాస్తోందని మండిపడ్డారు. గతేడాది రాష్ట్రంలో 12.5 కోట్ల పని దినాలు కల్పించగా.. ఈ ఏడాది కేవలం 7.5 కోట్ల పని దినాలకే పరిమితం చేశారన్నారు. రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన న్యాయమైన నిధుల వాటాను కేంద్ర ప్రభుత్వం సెస్‌లు, సర్‌చార్జీల పేరుతో కబళిస్తూ, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో ఉపాధి హామీ పథకంలోనూ 40 శాతం భారం రాష్ట్రాలపై మోపడం అన్యాయమని పేర్కొన్నారు. గ్రామీణ పేదల ఉపాధి హక్కును కాపాడాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తి నిధులు, బాధ్యతాయుతంగా కేంద్ర ప్రభుత్వమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

