VH Hanumantha Rao: జనగణనలో కులగణన చేపట్టాలని, ఓబీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రధాని మోదీ(Modhi)ని కోరామని కాంగ్రెస్ మాజీ ఎంపీ వి. హనుమంతరావు(VH Hanumantha Rao) తెలిపారు. ఢిల్లీలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తన పాదయాత్రలో ఎస్సీ(SC), ఎస్టీ(ST), మైనార్టీ, బీసీ(BC)ల సమస్యలను తెలుసుకున్నారని, జనగణనలో కుల వారిగా లెక్కలు తెలుస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. జనాభాలో 56% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారని, అనేక ఏళ్ల నుంచి ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ వాటిని 9వ షెడ్యూల్‌లో పెట్టాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
తెలంగాణ బీజేపీ నేతలను..
వెనుకబడిన కులాలకు 10% రిజర్వేషన్లు మోదీ ఇచ్చారని, అప్పుడు ఓబీసీ(OBC)లు ఏం మాట్లాడలేదని అన్నారు. అలాగే, బాపూజీ రోజ్ గార్ యోజన పేరును ప్రధాని మోదీ మన్ రేగాగా మార్చారని విమర్శించారు. ఓబీసీలలో బీజేపీ ఎంపీలు ఎంతోమంది ఉన్నారని, అయినా వారు ఈ సమస్యలపై ఎందుకు మాట్లాడటం లేదని హనుమంతరావు ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ నేతలను ఉద్దేశించి గెలిచి కూడా ఏం చేయడం లేదని మోదీ ఇటీవల అన్నారని గుర్తుచేశారు. కులగణన, ఓబీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమను ప్రధాని దగ్గరకు తీసుకెళ్తే, తామంతా కలిసి వస్తామని ఆయన ప్రకటించారు. బీజేపీ ఎంపీలు అందరూ తమను తీసుకెళ్ళి, ఓబీసీలకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

