Labour Codes: ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్స్ వల్ల ఉద్యోగుల టేక్‌హోమ్ జీతం తగ్గుతుందనే ప్రచారంపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. పీఎఫ్ (Provident Fund) కట్ విషయంలో ఎలాంటి మార్పు లేదని, ఎప్పటిలాగే రూ.15,000 వేతన పరిమితి (wage ceiling) ఆధారంగానే పీఎఫ్ డిడక్షన్ కొనసాగుతుందని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది.
సోషల్ మీడియా వేదిక Xలో కార్మిక శాఖ ఓ ప్రకటన విడుదల చేస్తూ, “ కొత్త లేబర్ కోడ్స్ అమలుతో టేక్‌హోమ్ పే తగ్గదు. పీఎఫ్ డిడక్షన్ ఇప్పటికీ చట్టపరమైన రూ. 15,000 వేతన పరిమితి ఆధారంగానే ఉంటుంది. ఈ పరిమితిని మించి చేసే పీఎఫ్ కంట్రిబ్యూషన్ పూర్తిగా స్వచ్ఛందం, తప్పనిసరి కాదు” అని స్పష్టం చేసింది.
గత నెల లేబర్ కోడ్స్ ప్రకటించిన తర్వాత, ‘వేతనం’ అనే నిర్వచనంలో మార్పు రావడంతో బేసిక్ పే, డీఏ వంటి భాగాలు మొత్తం జీతంలో కనీసం 50 శాతం ఉండాలన్న నిబంధనపై చర్చ మొదలైంది. దీనివల్ల పీఎఫ్ కంట్రిబ్యూషన్ పెరిగి టేక్‌హోమ్ జీతం తగ్గుతుందన్న ఆందోళనలు ఉద్యోగుల్లో వ్యక్తమయ్యాయి.
కొత్త వేతన నిర్వచనం కారణంగా పీఎఫ్‌తో పాటు ఈఎస్‌ఐసీ (ESIC), వర్క్‌మెన్స్ కంపెన్సేషన్, మాతృత్వ ప్రయోజనాలు వంటి సామాజిక భద్రతా లెక్కలపై ప్రభావం పడుతుందని అంచనాలు వెలువడ్డాయి. అయితే, దీనిపై కేంద్రం ఇప్పుడు స్పష్టత ఇస్తూ, పీఎఫ్ విషయంలో ఎలాంటి భయాలు అవసరం లేదని తెలిపింది.
మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈపీఎఫ్‌కు సంబంధించిన వేతన పరిమితి ఇప్పటికీ రూ.15,000గానే ఉంది. అంటే ఈ మొత్తానికి మాత్రమే పీఎఫ్ కంట్రిబ్యూషన్ తప్పనిసరి. ఈ పరిమితిని మించి ఉద్యోగి, యజమాని కలిసి అదనంగా చెల్లించుకోవచ్చు కానీ అది పూర్తిగా స్వచ్ఛందమే.
ఉదాహరణతో వివరణ ఇచ్చిన కేంద్రం
కేంద్రం ఓ ఉదాహరణను కూడా వివరించింది. ఒక ఉద్యోగి నెలకు రూ. 60,000 సంపాదిస్తున్నాడనుకుందాం. అందులో బేసిక్ సాలరీ, డీఏ కలిపి రూ.20,000 ఉండగా, మిగిలిన రూ.40,000 అలవెన్సులు. ఈ పరిస్థితిలో ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ 12 శాతం చొప్పున రూ. 15,000 పరిమితిపై మాత్రమే లెక్కిస్తారు.
లేబర్ కోడ్స్‌కు ముందు..
యజమాని పీఎఫ్ (12%) = రూ.1,800
ఉద్యోగి పీఎఫ్ (12%) = రూ. 1,800
టేక్‌హోమ్ జీతం = రూ.56,400
లేబర్ కోడ్స్ తర్వాత కూడా..
యజమాని పీఎఫ్ (12%) = రూ.1,800
ఉద్యోగి పీఎఫ్ (12%) = రూ. 1,800
టేక్‌హోమ్ జీతం = రూ.56,400 (ఎటువంటి మార్పు లేదు)
అలవెన్సులు మొత్తం జీతంలో 50 శాతం మించితే, ఆ మిగతా భాగాన్ని వేతనంగా పరిగణించి చట్టపరమైన లెక్కల్లో చేర్చాల్సి ఉంటుంది. అయితే పీఎఫ్ మాత్రం రూ.15,000 పరిమితికే పరిమితం అవుతుందని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.
కొత్త లేబర్ కోడ్స్ లక్ష్యం ఇదే
కేంద్ర ప్రభుత్వం నవంబర్ 21న 29 కార్మిక చట్టాలను విలీనం చేస్తూ నాలుగు లేబర్ కోడ్స్‌ను ప్రకటించింది. ఇవి – కోడ్ ఆన్ వేజెస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, సోషల్ సెక్యూరిటీ కోడ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ కోడ్. వ్యాపార సులభతను పెంచడమే కాకుండా, కార్మికుల హక్కులు, సామాజిక భద్రతను బలోపేతం చేయడమే వీటి ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.

