Akhilesh Yadav: ఉత్తర ప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని బీజేపీ(BJP) పార్టీని ఓడిస్తామని అన్నారు. తాము విభజన రాజకీయాలకు వ్యతిరేకమని, దానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా విజన్ ఇండియా ద్వారా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. సానుకూల, అభివృద్ది, ప్రగతిశీల రాజకీయాలే చేస్తామని తెలిపారు. సమాజ్ వాది పార్టీ అధ్యర్యంలో శనివారం నాడు హైదరాబాద్(Hyderabad) లో జరిగిన విజన్ ఇండియా సమ్మిట్ లో ఆ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) పాల్గొన్నారు. పరిపాలనలో సాంకేతికత వినియోగం, భవిష్యత్తులో సాంకేతికత రూపాంతరం వంటి అంశాలపై యువతలో అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఆ పార్టీ అన్ని ప్రధాన పట్టణాల్లో విజన్ ఇండియా సమ్మిట్ లను నిర్వహిస్తోంది. మొదటి సమ్మిట్ బెంగళూరులో నిర్వహించగా.. రెండో సమ్మిట్ హైదరాబాద్ లో నిర్వహించింది.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో..
ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ… రైతులకు, మౌలిక సదుపాయాల కల్పనకు, పట్టణీకరణ, పట్టణాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ట్రాఫిక్(Traffic) సమస్య పరిష్కారం, ఆరోగ్య, తదితర రంగాల్లో ఏఐ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. వీటిపై సమ్మిట్ లో నిపుణులు అనేక సలహాలు, సూచనలు ఇచ్చారని వివరించారు. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీని నేరాలను కట్టడి చేయడానికి ఉపయోగించాలని చెప్పారు. మానవులకు సరైన దృక్పథాన్ని, సానుకూల ఆరోచనలు కలిగించేలా భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీ అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే అత్యధిక సైబర్ నేరాలు జరుగుతున్నాయని, రోజురోజుకు సైబర్ స్కామ్స్ పెరుగుతూ పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ ఫ్రాడ్ ద్వారా నేరస్తులు కేవడం సామాన్యుల డబ్బులే దోచుకోవడం లేదని, ఐఏఎస్ అధికారులు, జడ్జీల వంటి ఉన్నత స్థాయిల్లో ఉన్న వారిని కూడా మోసం చేస్తున్నారని వివరంచారు. ఏఐ(AI) సహకారంతో సృష్టించిన ఫేక్ వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో చెలామణి చేస్తున్నారని అన్నారు. వీటన్నింటినీ ఏఐ టెక్నాలజీని వినియోగించుకొని అరికట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సాంకేతికత వల్ల అందరికీ లాభం జరగాలని ఆకాంక్షించారు.
Also Read: Phone Tapping Case: లొంగిపోయిన ప్రభాకర్ రావు.. వారం రోజులపాటు కస్టడీ విచారణ!
బీజేపీ ఎస్ఐఆర్ చేపడుతోందని..
ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ… ఉత్తర ప్రదేశ్ లో దాదాపు 25 కోట్ల జనాభా ఉందని ప్రభుత్వం చెబుతోందని, ఎస్ఐఆర్ ద్వారా బీజేపీ ప్రభుత్వం సుమారు 3 కోట్ల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. సాంకేతికతను సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్ల అనేక ఓట్లు పోతున్నాయని చెప్పారు. ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గెలవడానికే బీజేపీ ఎస్ఐఆర్ చేపడుతోందని ఆరోపించారు. ఇది ఎస్ఐఆర్ కాదని, ఇది జాతీయ పౌరుల నమోదు (ఎన్ఆర్సీ) ప్రక్రియ అని విమర్శించారు. ఎన్ఆర్సీని నేరుగా చేపట్టలేక ప్రభుత్వం ఎస్ఐఆర్ ను వాడుకుంటున్నదని, ఎన్ఆర్సీకి ఎన్ని పత్రాలు అడుగుతారో ఎస్ఐఆర్ కి అన్ని పత్రాలు అడుగుతున్నారని అన్నారు. బూత్ స్థాయి అధికారులకు కూడా శిక్షణ ఇవ్వలేదని, దీంతో క్షేత్ర స్థాయిలో అనేక సవాళ్లు, సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఓటు హక్కు కల్పించడం ఎన్నికల సంఘం బాధ్యత కానీ ఓట్లు తొలగించడం కాదని స్పష్టం చేశారు. కాగా, తాము ఇండియా కూటమిలోనే కొనసాగుతమని పునరుద్ఘాటించారు.
Also Read: Gurram Papireddy: యువర్ హానర్ ‘గుర్రం పాపిరెడ్డి’ ట్రైలర్ వచ్చేసింది.. చూసి నవ్వుకోండి..

