CM Revanth Reddy: హైదరాబాద్ లోని టీ హబ్ లో గూగుల్ స్టార్టప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్‌లో ఉన్న అగ్రస్థాయి స్టార్ట్-అప్స్ లో గూగుల్ ఒకటని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా యువతులకు కీలక సందేశం ఇచ్చారు. ‘మీరు యువకులు, శక్తివంతులు.. సాధారణంగా మీరు మీ కలలను సాకారం చేసుకోవాలనుకుంటారు. ఈ సందర్భంగా మీకు స్పూర్తిని కలిగించే ఒక విషయం చెబుతా’ అంటూ ఓ ఆసక్తిక విషయాన్ని సీఎం రేవంత్ పంచుకున్నారు.
గారేజీతో మెుదలై..
గూగుల్ స్టార్టప్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ ‘ఉన్నత ఆశయాలతో 1998లో ఇద్దరు స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ మిత్రులు కలిసి కాలిఫోర్నియాలో ఒక గారేజీలో ఓ స్టార్ట్-అప్ ను ప్రారంభించారు. అదే నేటి ప్రఖ్యాత గూగుల్ కంపెనీగా అవతరించింది. తెలంగాణ భవిష్యత్ అభివృద్దిని ఆకాంక్షించి ప్రపంచానికి తెలంగాణ బ్రాండ్ ను పరిచయం చేయాలని గత రెండు రోజులు, మనం తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించాం. జాతీయ అంతర్జాతీయ కార్పోరేట్ల సమక్షంలో తెలంగాణ భవిష్యత్ కోసం మన విజన్‌ను ఆవిష్కరించాం’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
గూగుల్, ఆపిల్ గొప్ప ఉదాహరణ
2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని టార్గెట్ ఏర్పరుచుకున్నట్లు చెప్పారు. ‘గత 20 ఏళ్ల క్రితం ప్రారంభించిన అనేక స్టార్ట్ అప్స్ నేడు బిలియన్ల డాలర్ల కంపెనీలుగా ఎదిగాయి. గూగుల్, ఆపిల్, అమెజాన్, టెస్లా, ఫేస్‌బుక్ ఇలాంటి గొప్ప ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. గత 25 సంవత్సరాల్లో సాఫ్ట్‌వేర్ సర్వీసెస్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో. హైదరాబాద్‌లో చాలా స్టార్ట్-అప్స్ పెద్ద కంపెనీలుగా ఎదిగాయి’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
స్టార్టప్స్‌కు ఫుట్ బాల్‌తో లింకప్!
తెలంగాణ రైజింగ్ విజన్ స్టార్ట్-అప్స్ కోసం మీ ప్రణాళికలు ఏంటని అడిగితే తాను స్టార్ట్ అప్ ని ఫుట్‌బాల్ ఆటతో పోల్చుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘నేను ఆ ఆట ఆడతాను. ఫుట్‌బాల్‌లో సమిష్టి కృషి అవసరం. పట్టుదలతో సాధన చేయాలి. ఇది టీమ్ వర్క్. కానీ చివరకు గెలుపు చాలా ముఖ్యం. స్టార్ట్ -అప్స్ కూడా అదే విధంగా ఉండాలి. ఈ రోజు నుంచి హైదరాబాద్ ప్రోడక్ట్ బేస్డ్ స్టార్ట్ – అప్స్, ఇన్నోవేటీవ్ స్టార్ట్-అప్స్, ఐపీ ఇంటెన్సీవ్ స్టార్ట్ – అప్స్ వీటి పైనే దృష్టి పెట్టాలి. హైదరాబాద్ కేవలం స్టార్ట్ అప్ హబ్ గా ఎదగడమే కాదు. ఆ కంపెనీలు యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలని కోరుకుంటున్నా. హైదరాబాద్ నుంచి కనీసం 100 స్టార్టప్ లు యూనికార్న్స్ కంపెనీలుగా ఎదగాలని ఆశిస్తున్నా. అంటే కనీసం 1 బిలియన్ డాలర్ల విలువ కలిగిన కంపెనీలుగా ఎదగాలి’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: US Plane Crash: ఓరి దేవుడా.. కారుపై కుప్పకూలిన ఎయిర్ క్రాఫ్ట్.. వీడియో వైరల్
రూ.1000 కోట్ల ఫండ్
2034 నాటికి వాటిల్లో కనీసం 10 సూపర్ యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ‘అందుకోసం రాష్ట్రంలో ఒక మంచి ఎకోసిస్టమ్‌ను సృష్టించాలనుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ మీకు అవసరమైన సహకారం అందించడానికి సిద్దంగా ఉన్నాయి. స్టార్టప్ ల కోసం మా ప్రభుత్వం రూ. 1000 కోట్లతో స్టార్ట్ అప్ ఫండ్ ఏర్పాటు చేస్తుంది. ఆ ఫండ్స్ ను వినియోగించుకోండి. తద్వారా స్టార్ట్ అప్ లు గూగుల్ స్థాయిలో లేదా 1 బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదగాలని కోరుకుంటున్నాం’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

