CM Revanth – Global Summit: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. స్వాతంత్రం తర్వాత దేశాభివృద్ధికి రాజ్యాంగం అనే రూట్ మ్యాప్ ను నిర్మించారని సీఎం రేవంత్ గుర్తుచేశారు. తాము కూడా తెలంగాణ భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ రూపొందించాలనుకున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం గాంధీ, అంబేద్కర్ ల నుంచి ఎంతో స్ఫూర్తిని పొందినట్లు చెప్పారు. వచ్చే పదేళ్లలో తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్ఫష్టం చేశారు.
నిపుణుల సలహాతో విజన్ రూపకల్పన
ప్రపంచంలోనే ఉన్నత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు యత్నిస్తున్నట్లు గ్లోబల్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘దేశానికి స్వాతంత్రం సిద్ధించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న 2047 నాటికి మనమేం సాధించగమో చెప్పాలని నిపుణులను కోరా. ఆ సమయంలోనే తెలంగాణ రైజింగ్-2047 దార్శనికతకు బీజం పడింది. మనమేదైనా గొప్పగా చేయాలని భావించినప్పుడు తెలంగాణ సంస్కృతిలో ముందుగా దేవుళ్ల ఆశీర్వాదం తీసుకుంటాం. ప్రజల మద్దతు కోరుతాం. భవిష్యత్తు కోసం మన కలలను నెరవేర్చుకోవడానికి ప్రజల ఆలోచనలు, అంచనాలు తెలుసుకున్నాం. అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నీతి ఆయోగ్ నిపుణుల సహాయం తీసుకున్నాం. తెలంగాణ రైజింగ్ విజన్ రూపొందించడంలో సహయపడిన వారందరికీ ధన్యవాదాలు’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
2047 నాటికి మా లక్ష్యమదే
ఈ గ్లోబల్ సమ్మిట్‌కు అన్ని రంగాలకు చెందిన ప్రతినిధులు ఇక్కడకు రావడం మన అదృష్టంగా భావిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. మంచి సానుకూల వాతావరణం ఉంది. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని మేం సంకల్పించాం. దేశంలో తెలంగాణ దాదాపు 2.9% జనాభా కలిగి ఉంది. దేశ జీడీపీలో తెలంగాణ నుంచి దాదాపు 5% వాటాను అందిస్తున్నాం. 2047 నాటికి భారతదేశ GDPలో 10% వాటాను తెలంగాణ నుంచి అందించాలన్నది మా లక్ష్యం’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: Aviation Minister: ఇండిగో సంక్షోభం.. రాజ్యసభ వేదికగా మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
‘ఆ దేశాలతో పోటీ పడతాం’
సేవారంగం, తయారీ రంగం, వ్యవసాయ రంగం… ఇలా తెలంగాణను స్పష్టమైన 3 భాగాలుగా విభజించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘మూడు భాగాలుగా విభజించి ప్రాంతాల వారీగా అభివృద్ధి లక్ష్యాలను నిర్ధేశించుకున్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రం. ఇందుకోసం క్యూర్, ప్యూర్, రేర్ మోడల్స్ నిర్ధేశించాం. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల నుంచి మేమెంతో ప్రేరణ పొందాం. ఇప్పుడు మేం ఆ దేశాలతో పోటీ పడాలనుకుంటున్నాం. మా ఈ తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో సహకరించడానికి, పెట్టుబడి పెట్టడానికి, మాకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ మీఅందరినీ ఆహ్వానించాం. ఈ విజన్ కష్టంగా అనిపించవచ్చు. కానీ ఆ విజన్ ను సాధించగలం. ఈ విషయంలో మా టీమ్ కు నేను చెప్పేదొక్కటే. కష్టంగా ఉంటే వెంటనే చేపడుదాం. అసాధ్యం అని అనుకుంటే వారికి కొంత గడువు ఇస్తా’ అని సీఎం రేవంత్ సూచించారు. తెలంగాణ రైజింగ్ నిరంతర ప్రక్రియ (అన్ స్టాపబుల్) చెబుతూ సీఎం రేవంత్ తన ప్రసంగాన్ని ముగించారు.
తెలంగాణ రైజింగ్ అన్ స్టాపబుల్: సీఎం రేవంత్ రెడ్డి
కోర్, ప్యూర్, రేర్ స్ట్రాటజీతో తెలంగాణ రైజింగ్-2047
సేవారంగం, ఉత్పత్తి రంగం, వ్యవసాయ రంగం.. ఇలా 3 భాగాలుగా విభజించి నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్నాం
చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల… pic.twitter.com/9QxtVdsoP7
— BIG TV Breaking News (@bigtvtelugu) December 8, 2025

