Kavitha: పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న రోజే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) రాత పరీక్ష నిర్వహించడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) తీవ్రంగా స్పందించారు. వేలాది మంది గ్రామీణ ప్రాంత అడ్వకేట్లు ఓటు హక్కుకు లేదంటే ఏపీపీ రాత పరీక్షలకు దూరం కావాలా? అని ప్రశ్నిస్తూ ఆమె ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈనెల 14న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయని, అదే రోజున తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్షలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తోందని పేర్కొన్నారు.
Also Read: MLC Kavitha: పెద్దల ఇళ్లను కూడా కూల్చేయండి.. హైడ్రా కమిషనర్‌కు కవిత సూటి ప్రశ్న
ఓటు వేయాలా?, పరీక్ష రాయాలా?
ఏపీపీ రాత పరీక్షలను జిల్లా కేంద్రాలు, హైదరాబాద్‌లో నిర్వహిస్తుండటంతో వేలాది మంది గ్రామీణ ప్రాంతాల న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోతున్నారని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ఓటు వేయాలా?, పరీక్ష రాయాలా? అనే అయోమయ పరిస్థితిని నివారించాలని ఆమె కోరారు. ముఖ్యమంత్రి వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. ఈనెల 14న తలపెట్టిన ఏపీపీ రాత పరీక్షలను వాయిదా వేసేలా టీజీఎస్ పీఆర్బీకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
Also Read: Kavitha On Pawan: ‘పక్కోడు బాగుంటే.. మా కళ్లు మండవు’.. పవన్‌కు కవిత స్ట్రాంగ్ కౌంటర్!

