TG Global Summit: భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్–2047లో మహిళా సాధికారతకు ప్రతీకగా ఇందిరా మహిళా శక్తి స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రజాప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక అభ్యున్నతిని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న విధానాలకు ఈ స్టాల్ అద్దం పడుతోంది. మహిళా స్వయం సహాయక సంఘాల శక్తి, సాధికారత, వ్యాపార నైపుణ్యాలను జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధుల ముందు సమగ్రంగా ప్రదర్శించే వేదికగా ఈ స్టాల్ నిలుస్తోంది. పట్టణ పేదరిక నిర్మూళన సంస్థ (సెర్ప్), తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ఈ స్టాల్‌ను ఏర్పాటు చేశాయి. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం చేపట్టిన అనేక వినూత్న కార్యక్రమాల నమూనాలు ఇక్కడ ప్రదర్శితమవుతున్నాయి.
డాక్యుమెంటరీల ద్వారా..
ముఖ్యంగా, మహిళలే నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి పెట్రోలు బంకు, హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్, జిల్లాల వ్యాప్తంగా నిర్మితమైన ఇందిరా మహిళా శక్తి భవనాలు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, అలాగే ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ వంటి విభిన్న వ్యాపారాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలు సాధించిన విజయాలు ఈ స్టాల్‌లో ప్రత్యేకంగా ఆకట్టుకోబోతున్నాయి. గ్రామీణ స్థాయి నుంచి గ్లోబల్ వేదిక వరకు మహిళల ప్రయాణాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన డాక్యుమెంటరీలను ప్రదర్శన కోసం ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు. మహిళా స్వయం సహాయక బృందాలు ఎలా వ్యాపారవేత్తలుగా ఎదిగాయి, ప్రభుత్వ ప్రోత్సాహంతో స్వయం ఉపాధి ఎలా సుస్థిర ఆదాయ మార్గాలుగా మారింది అనే అంశాలను ఈ డాక్యుమెంటరీల ద్వారా సందర్శకులు తెలుసుకోగలుగుతారు. అలాగే మహిళా శిశు సంక్షేమం కోసం ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన నూతన కార్యక్రమాల వివరాలను కూడా స్టాల్‌లో సమగ్రంగా ప్రదర్శిస్తున్నారు.
Also Read: CM Revanth Reddy: ‘కేసీఆర్.. మీ కొడుకే నీకు గుది బండ’.. దేవరకొండ సభలో సీఎం రేవంత్
సాధికారతకు ప్రభుత్వం నిబద్ధత
ప్రజా ప్రభుత్వ పాలనలో మహిళా సాధికారతకు ఇస్తున్న ప్రాధాన్యత ఈ స్టాల్‌లో ప్రతిఫలిస్తోంది. వేల కోట్ల రూపాయల బ్యాంకింగ్ లింకేజీ రుణాల ద్వారా మహిళా సంఘాలకు ఆర్థిక బలాన్ని అందించడం, వందల కోట్ల రూపాయల వడ్డీ చెల్లింపులతో మహిళలపై రుణభారాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకున్నారు. మహిళా సభ్యులకు రూ.10 లక్షల లోన్ బీమా, రూ.2 లక్షల ప్రమాద బీమా వంటి భద్రతా చర్యలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా పాలనలో మంత్రి సీతక్క మార్గదర్శనంలో మహిళలపై ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే 20కి పైగా విభిన్న వ్యాపార రంగాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తూ, మహిళలను యజమానులుగా, నాయకులుగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళుతోంది. ఈ స్టాల్, ‘మహిళ ఉన్నతి తెలంగాణ ప్రగతి’ అన్న ప్రజా ప్రభుత్వ సంకల్పానికి ప్రతీకగా నిలిచి, దేశం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.
Also Read: TG Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు వృత్తాకార వేదిక రెడీ!

