Singareni News: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విజన్ 2047కు అనుబంధంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(Singareni Collieries Company Limited) కూడా తమ విజన్ 2030-2047 డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో గురువారం సాయంత్రం జరిగిన సమావేశంలో సంస్థ సీఎండీ బలరాం నాయక్(CMD Balaram Nayak) ఈ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. సింగరేణి సంస్థను కేవలం బొగ్గు రంగంకే పరిమితం చేయకుండా, రాష్ట్ర మరియు దేశ అవసరాలకు అనుగుణంగా బొగ్గుతో పాటు ఇతర కీలక రంగాల్లోకి భారీగా విస్తరింపజేయాలని ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన తెలిపారు. దేశ విదేశాల్లో కీలక ఖనిజ రంగంలో ప్రవేశించడానికి వీలుగా సింగరేణికి అనుబంధంగా గ్లోబల్ సింగరేణి లిమిటెడ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
2030 స్వల్ప, మధ్యకాలిక ప్రణాళికలు
విజన్ డాక్యుమెంట్‌లో 2030 వరకు స్వల్ప, మధ్యకాలిక ప్రణాళికలను స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ప్రణాళికల ద్వారా సింగరేణి తన సాంప్రదాయ మరియు పునరుత్పాదక రంగాల్లో గణనీయమైన వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సింగరేణి సంస్థ 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం ప్రస్తుత లీజు ప్రాంతాల్లోనే కాక, వివిధ రాష్ట్రాలలోని కొత్త బొగ్గు బ్లాకులను కూడా చేపట్టాలని నిర్ణయించింది. థర్మల్ విద్యుత్ ఉత్పాదనను ప్రస్తుత 1,200 మెగావాట్ల నుంచి 4,400 మెగావాట్లకు పెంచడానికి ప్రణాళికలు రూపొందించింది. అంతేకాకుండా, 2029-30 నాటికి మొత్తం 5.85 గిగా వాట్ల (5,850 మెగావాట్ల) పునరుత్పాదక విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా సోలార్ విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
గ్లోబల్ సింగరేణి ఏర్పాటు
2030 నాటికి 2,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యం కాగా, ఇందులో రాజస్థాన్‌లో 1,500 మెగావాట్ల ప్లాంట్‌తో పాటు, రాష్ట్రంలోని నీటి జలాశయాలపై 800 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించుకుంది. వీటితో పాటు మణుగూరు వద్ద 200 మెగావాట్ల జియో థర్మల్ ప్లాంట్(Geothermal plant), ఓపెన్ కాస్ట్ డంపులపై 100 మెగావాట్ల పవన విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో మూతబడిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని వద్ద 250 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సింగరేణి సంస్థ తన సంప్రదాయ రంగాలకే పరిమితం కాకుండా, కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశ విదేశాల్లో ఈ రంగంలో గల అవకాశాలను పరిశోధించడం కోసం ప్రఖ్యాత పరిశోధన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే రాగి, బంగారం అన్వేషణకు లైసెన్స్ సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో ఇటువంటి కార్యకలాపాలు నిర్వహించడానికి వీలుగా సింగరేణికి అనుబంధంగా గ్లోబల్ సింగరేణి లిమిటెడ్ అనే అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాలని విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరిచారు.
దీర్ఘకాలిక లక్ష్యాలు
సింగరేణి సంస్థ తన దీర్ఘకాలిక ప్రణాళిక 2047లో అత్యంత ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2047 నాటికి మొత్తం 25 గిగావాట్ల పరిమాణంలో వివిధ రకాల పునరుత్పాదక విద్యుత్తును (సోలార్, ఫ్లోటింగ్ సోలార్, పంప్డ్ స్టోరేజీ, జియో థర్మల్) ఉత్పత్తి చేయాలని విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరిచారు. పర్యావరణహిత మైనింగ్ చేపడుతూ, వాతావరణ కాలుష్య నివారణ కోసం కోల్ వాషరీలను ఏర్పాటు చేయడం, కోల్ గ్యాసిఫికేషన్, లిక్విఫికేషన్ ప్రణాళికను అమలుచేయడం ద్వారా కర్బన ఉద్గారాలను అదుపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యాపార విస్తరణలో భాగంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రంగంలోకి దిగనుంది. మెటల్ మైనింగ్ రంగంలో అన్వేషణ విభాగపు సేవలు అందించనుంది. ఉద్యోగులకు నూతన టెక్నాలజీకి అనుగుణంగా శిక్షణలు ఇవ్వడం, ఆరోగ్య రక్షణ, భద్రత, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
Also Read: High Court: హైకోర్టుకు హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. ఎందుకంటే..?

