Gummadi Narsaiah Biopic: భారత రాజకీయ చరిత్రలో నిరాడంబరతకు, నిజాయితీకి చిరునామాగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘గుమ్మడి నర్సయ్య’ సినిమా షూటింగ్ పాల్వంచలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ శివ రాజ్ కుమార్ నర్సయ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, జారే ఆదినారాయణ కూడా హాజరయ్యారు. శివ రాజ్ కుమార్ స్వయంగా నర్సయ్య స్వగ్రామానికి వెళ్లి ఆయన్ని కలిసి, ఆయన జీవనశైలిని తెలుసుకున్నారు. ఇది ఆ పాత్ర పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తోంది.
Read also-Haiku Movie: ‘కోర్టు’ మూవీ ఫేం శ్రీదేవి అపల్ల ‘హైకు’ ఫస్ట్ లుక్ విడుదలైంది చూశారా?
మంత్రి ఏం అన్నారంటే..
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, “గుమ్మడి నర్సయ్య ప్రజల మనిషి” అని కొనియాడారు. ఆయన నిరాడంబర జీవితాన్ని, ఎమ్మెల్యే జీతాన్ని, ఆస్తులను సైతం పేదలకు దానం చేసిన గొప్పతనాన్ని గుర్తుచేసుకున్నారు. “ఆయన నిరాడంబర జీవితం ఆదర్శం. ఈ సినిమా ద్వారా ప్రజా ప్రతినిధుల జీవితాల్లో మార్పు వస్తుందని భావిస్తున్నాను,” అని ఆకాంక్షించారు. అంతేకాక, ఈ చిత్రాన్ని ప్రోత్సహించేందుకుగాను సినిమా రాయితీలు ఇచ్చే విషయంపై ముఖ్యమంత్రితో మాట్లాడతానని హామీ ఇవ్వడం విశేషం. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read also-Chiranjeevi MSG: ‘మనవరప్రసాద్ గారు’ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో ‘శశిరేఖ’ కాదు.. ‘కాత్యాయనీ’..
తెలుగు నేర్చుకుని డబ్బింగ్..
ఈ సినిమాలో గుమ్మడి నర్సయ్య పాత్రను పోషిస్తున్న కన్నడ నటుడు శివ రాజ్ కుమార్, ఈ పాత్ర తనకెంతో గర్వకారణమని తెలిపారు. తాను తెలుగు నేర్చుకుని మరీ స్వయంగా డబ్బింగ్ చెప్పుతానని ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ పట్ల ఆయనకున్న అంకితభావం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. గుమ్మడి నర్సయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గం నుంచి కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్- లెనినిస్ట్) తరపున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా సైకిల్‌పై అసెంబ్లీకి వెళ్లడం, ప్రజా సమస్యల పట్ల రాజీలేని పోరాటం చేయడం, సొంత ఆస్తులంటూ కూడబెట్టుకోకుండా నిస్వార్థంగా బతకడం వంటి అంశాలు ఆయన జీవితాన్ని చిరస్మరణీయం చేశాయి. పరమేశ్వర్ హిర్వాలే దర్శకత్వం వహిస్తున్న ఈ బయోపిక్, కేవలం రాజకీయ కథనం కాకుండా, నిజాయితీ, ప్రజాసేవ, రాజ్యాంగం పట్ల గౌరవం వంటి అంశాలపై నేటి యువతకు స్ఫూర్తినిచ్చే చిత్రంగా నిలుస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.

