Etela Rajender: సర్పంచ్ ఎన్నికల్లో డబ్బుల పంపిణీని ఆపగలిగేది కేవలం ప్రజలు మాత్రమేనని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender) అన్నారు. ఈ సంస్కృతిని ప్రజలే అంతం చేయాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్, అసెంబ్లీతో పాటు గ్రామ సచివాలయాలు, మండల, జిల్లా పరిషత్‌లు సమర్థవంతంగా పనిచేస్తేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామాల్లో ఉండే సమస్యలపై సర్పంచ్‌కు ఉన్న అవగాహన ఎంపీపీ(MPP), జెడ్పీటీసీ(ZPTC), ఎమ్మెల్యే(MLA), ఎంపీ(MP)లకు ఉండదన్నారు. అందుకే గ్రామ సచివాలయాలు ఎంత గొప్పగా పనిచేస్తే ప్రజల సమస్యలు అంత గొప్పగా పరిష్కారమవుతాయని తెలిపారు. కానీ, వాటికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నదని ఈటల విమర్శించారు. కేంద్రం ఇచ్చే పర్ క్యాపిటా, ఫైనాన్స్ కమిషన్, ఉపాధిహామీ నిధులతో మాత్రమే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతున్నదన్నారు.
ఈ రెండేళ్లలో బిల్లులు
గత సర్పంచ్‌లు చేసిన పనులకు బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల అనేకమంది సర్పంచ్‌లు అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భార్య పుస్తెలు అమ్మి, ఉన్న ఆస్తులు అమ్మి పనులు చేసినా బిల్లులు చెల్లించలేదని ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్లు ఇచ్చుకోలేక, ఆఫీసులు చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిందని, ఈ రెండేళ్లలో బిల్లులు చెల్లించలేని, పనులు చేయలేని మంత్రులు ఇప్పుడు వచ్చి సర్పంచ్‌లను గెలిపించాలని కోరుతున్నారన్నారు. ఈ మూడేళ్లు పనులు చేస్తామని చెబుతున్నారని, అయినా వారి మాటలపై ఎవరికీ నమ్మకం లేదన్నారు. గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసింది గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వమేనన్నారు. బిల్లులు పెండింగ్ పెట్టి ఇప్పుడు వచ్చి మళ్లీ ఓట్లు అడుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. వారితో ప్రజలకు వచ్చేది, పోయేదేం లేదని ఎద్దేవాచేశారు. ప్రజల మధ్యలో ఉండి, సమస్యలు అర్థం చేసుకుని పరిష్కరించే వారిని ఎన్నుకోవాలని ఈటల పిలుపునిచ్చారు. పోటీ చేసేవారు కూడా అడ్డగోలు హామీలు ఇచ్చి ఆగం కావొద్దని ఈటల సూచించారు.
Also Read: Smriti Wedding: స్మృతి మంధాన పెళ్లి వాయిదాపై పలాష్ ముచ్ఛల్ సోదరి పాలక్ ఎమోషనల్ కామెంట్స్
డంపింగ్ యార్డ్ సమస్యపై పార్లమెంట్‌లో ఈటల గళం
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్(Dumping yard) సమస్యపై పార్లమెంట్‌లో ఈటల తన గళం వినిపించారు. జవహర్‌నగర్‌లో 40 ఏండ్ల కిందట డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారని, అప్పుడు ఒకటి రెండు చెత్త వాహనాలు వచ్చి చెత్త వేసేవని తెలిపారు. కానీ, ప్రస్తుతం 10వేల టన్నుల చెత్తను ఒకేచోట వేస్తున్నారన్నారు. 30 కిలోమీటర్ల చుట్టూ నివసిస్తున్న లక్షల మంది ప్రజలు డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే దుర్వాసన, కీటకాల వల్ల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఒకే చోట ఇంత పెద్ద డంపింగ్ యార్డ్ ఉండొద్దని 1.5 కోట్ల జనాభా ఉన్న హైదరాబాద్(Hyderabad) నగరంలో నాలుగు మూలలా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

