Venkatalachimmi: పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput).. ‘ఆర్‌ఎక్స్ 100’ (RX100)తో ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ల మనసులు దోచేసిన ఈ భామ, ఆ తర్వాత టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ వేసిన కొన్ని రాంగ్ స్టెప్స్ ఆమెనే ఆ స్థాయికి చేరనీయలేదు. అయినా సరే.. తన నటనతో మెప్పిస్తూనే వస్తున్నారు. ఇటీవల ఆమె నుంచి వచ్చిన ‘మంగళవారం’ చిత్రంలో ఆమె నటనకు అంతా ఫిదా అయ్యారు. యూత్ ఆడియన్స్‌కు హాట్ ఫేవరేట్ హీరోయిన్‌గా మారిన పాయల్ రాజ్‌పుత్.. మరోసారి పవర్ ఫుల్ కంటెంట్‌తో ‘వెంకటలచ్చిమి’ (Venkatalachimmi)గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా పాయల్ రాజ్‌పుత్ బర్త్‌డేను (HBD Payal Rajput) పురస్కరించుకుని, ఈ సినిమా టీమ్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా ఎంత ఇంటెన్స్‌గా, థ్రిల్లింగ్‌గా ఉండబోతుందో అర్థమవుతోంది.
జైలులో టార్చర్
రాజా, పవన్ బండ్రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముని దర్శకుడు. బర్త్ డే స్పెషల్‌గా వచ్చిన ఈ పోస్టర్‌లో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌ను జైలు గదిలో పైకప్పుకు తలక్రిందులుగా వేలాడిదీసి చేతికి సంకెళ్లు వేశారు. అలాగే ఆమె మేడలో మంగళసూత్రం కనిపిస్తుంది. ఒంటి నిండా రక్తపు మరకలు, చుట్టూ భయానక వాతావరణం.. అన్ని కలిసి పోస్టర్‌కి పవర్‌ఫుల్ టచ్‌ను ఇస్తున్నాయి. ఆమె చేతులుకి సంకెళ్లు ఉండటం, రక్తంతో కూడిన మంగళసూత్రం, చుట్టూ నిశ్శబ్ద భయానికి సూచనగా ఉన్న నేపథ్యం చూస్తుంటే.. ఆమెను జైలులో టార్చర్ పెట్టినట్లుగా అర్థమవుతోంది. నిజంగా ఒక హీరోయిన్ ఇలాంటి సాహసం చేయడమంటే మాములు విషయం కాదు. ఈ పోస్టర్ సినిమాపై ఉత్కంఠను పెంచుతూ, భారీ అంచనాలు పెంచేస్తోంది. పోస్టర్‌పై ఫస్ట్ లుక్, గ్లింప్స్ త్వరలోనే రాబోతుందని ప్రకటించారు. ఈ పోస్టర్‌తో పాయల్‌కు టీమ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
Also Read- Actress Pragathi: నవ్వుకున్న వాళ్లందరికీ ఇదే ప్రగతి ఆన్సర్.. ఇండియా తరపున టర్కీ ఏషియన్ గేమ్స్‌కు!
ఆదివాసీ మహిళ ప్రతీకార కథ
ఆదివాసీ మహిళ యొక్క ప్రతీకార కథగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నామని.. కథ, కథనాలు ఆసక్తికరంగా, ఎవరూ ఊహించని విధంగా ఉంటాయని దర్శకుడు ముని చెబుతున్నారు. ఈ కథ తనకు ఎంతగానో నచ్చిందని, ఈ సినిమా తర్వాత తనను ప్రేక్షకులు ‘వెంకటలచ్చిమి’ అనే పేరుతో పిలుస్తారని, అంత బలమైన ఎమోషన్స్ ఇందులో ఉన్నాయని, నా నటనకు పరీక్షలాంటి సినిమా ఇదని పాయల్ రాజ్‌పుత్ తెలిపారు. పాన్ ఇండియా స్థాయిలో 6 భాషల్లో తెరకెక్కించబోతున్న ఈ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంటామనే ధీమాని వ్యక్తం చేశారు నిర్మాతలు రాజా, పవన్ బండ్రెడ్డి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

