Sabarimala: పవిత్ర పుణ్య క్షేత్రం శబరిమలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాద్ కి చెందిన భక్తుడిపై స్థానిక వ్యాపారి దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. వాటర్ బాటిల్ ధర ఎక్కువగా ఉందని ప్రశ్నించినందుకు గాజు సీసాతో తల పగలగొట్టారు. దీంతో బాధిత భక్తుడికి అండగా తెలుగు రాష్ట్రాల భక్తులు షాపు ఎదుట ఆందోళనకు దిగారు. అయితే చుట్టు పక్కల షాపుల వారు కూడా భక్తులపై ఎదురు తిరగడంతో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కూడా షాపు యజమానులకే మద్దతుగా మాట్లాడుతున్నట్లు తెలుగు భక్తులు ఆరోపిస్తున్నారు.
తెలుగు భక్తులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన తెలుగు భక్తుడు షాపు వద్దకు వెళ్లి వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడు. ధర అధికంగా ఉండటంతో షాపు యజమానిని నిలదీశాడు. దీంతో షాపు యజమానికి భక్తుడికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన షాపు యజమాని.. గాజు సీసాతో తెలుగు భక్తుడి తలపై దాడి చేశాడు. దీనిని నిరసిస్తూ తెలుగు భక్తులు షాపు ముగింట ఆందోళనకు దిగారు.
Also Read: CM Revanth Reddy: అధికారం చేపట్టిన రోజు నుంచే రేవంత్ మార్క్.. గ్యారంటీ అమలులో చిత్తశుద్ధి చాటుకున్న సీఎం!
అయితే చుట్టుపక్కల వ్యాపారులు షాపు యజమానికే వత్తాసు పలికుతూ తెలుగు భక్తులపై విమర్శలు చేశారు. దీంతో వ్యాపారులు వర్సెస్ తెలుగు భక్తులుగా పరిస్థితులు మారిపోయాయి. పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసేలా మారుతున్న క్రమంలోనే శబరిమల పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే తమపై దాడి జరిగినప్పటికీ పోలీసులు.. వ్యాపారులకే మద్దతుగా నిలిచారని తెలుగు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెుత్తం మీద తెలుగు భక్తులను అక్కడి నుంచి పంపివేయడంతో వివాదం సర్దుమణిగింది.

