Putin Lands in Delhi: భారత్‌కు చిరకాల మిత్రదేశమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) భారత్‌లో గురువారం అడుగుపెట్టారు. రాత్రి 7 గంటలకు ఆయన విమానం ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అయింది. ఇరుదేశాల మధ్య వార్షిక సదస్సుల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) స్వయంగా స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులో ఇరువురూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయ ఆలింగనం చేసుకున్నారు. పుతిన్‌కు స్వాగత సూచకంగా భారతీయ కళాకారిణులు ఎయిర్‌పోర్టులో సంప్రదాయ నృత్య ప్రదర్శనలు చేశారు.
ముందస్తు షెడ్యూల్‌లో లేకపోయినప్పటికీ ప్రధాని మోదీ స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి స్వాగతం పలకడంతో పుతిన్ సహా రష్యా ప్రతినిధుల బృందం ఆశ్చర్యపోయింది. ఎయిర్‌పోర్ట్ నుంచి ‘7 లోక్ కళ్యాణ్ మార్గ్’కు ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. మోదీ కారులో పుతిన్ ప్రయాణించారు.
పుతిన్ భారత పర్యటన షెడ్యూల్ ఇదే
భారత్ చేరుకున్నాక అధికారిక ఫొటో సెషన్ కార్యక్రమం ఉంటుంది. అది పూర్తయిన తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చే ప్రత్యేక విందులో పుతిన్ పాల్గొంటారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా పుతిన్ గురువారం రాత్రికి బస చేసే ప్రదేశాన్ని వెల్లడించలేదు.
శుక్రవారం కార్యక్రమాలు ఇవే
శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో రాష్ట్రపతి భవన్ వద్ద పుతిన్‌కు లాంఛనప్రాయ స్వాగతం ఇవ్వనున్నారు. దాదాపుగా 11.30 గంటల సమయంలో రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్ ఘాట్‌కు వెళ్తారు. అక్కడ మహాత్మా గాంధీకి నివాళులు అర్పించి, పుష్పగుచ్ఛాన్ని ఉంచనున్నారు. 11:50 గంటలకు భారత్-రష్యా మధ్య 23వ సదస్సు చర్చల కోసం ప్రధాని మోదీతో పుతిన్ సమావేశం అవుతారు. ఇందుకోసం ఢిల్లీలోని ‘హైదరాబాద్ హౌస్’కు చేరుకుంటారు. ఈ చర్చలు కొన్ని గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1.50 గంటలకు సమావేశ వేదిక వద్ద మీడియా ప్రకటనలు ఉంటాయి. .
సాయంత్రం 3.40 గంటల సమయంలో అధ్యక్షుడు పుతిన్ ఒక వ్యాపార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను పంచుకోలేదు. ఇక, సుమారు సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పుతిన్ భేటీ అవుతారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్‌కు వెళ్తారు. రాత్రి 9 గంటలకు అధ్యక్షుడు పుతిన్ తిరిగి మాస్కో పయనం అవుతారు.
