Congress vs BJP: జనసేనా అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు వెనక బీజేపీ ఉన్నదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసేందుకు సిద్ధమైంది. తెలంగాణలో ఈ స్లోగన్‌ను ఎత్తుకొని బీజేపీ పార్టీని డ్యామేజ్ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ లైన్‌లోనే ప్రచారం చేసి బీజేపీ క్యాడర్‌ను డైలమాలో పడేయాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది. ఈ మేరకు డీసీసీలు, స్పోక్స్ పర్సన్లకు పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. తెలంగాణ ప్రజలను ఘోరంగా అవమానించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కాపాడడానికి తెలంగాణ బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని టీ కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు.
సీఎంను విమర్శించడం ఏమిటని?
పవన్ కల్యాణ్‌ను సైడ్ ట్రాక్ చేసేందుకు ప్రజల వ్యక్తిగత దైవారాధనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన విశ్లేషణను బీజేపీ వివాదాస్పదం చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. తెలంగాణ ప్రజలది నరదిష్టి అని అహంపూరిత వ్యాఖ్యలు చేసిన పవన్‌ను వదిలేసి, సీఎంను విమర్శించడం ఏమిటని? కాంగ్రెస్ నాయకులు బీజేపీపై మండిపడుతున్నారు. పవన్‌ను అవసరమైన ప్రతిచోట బీజేపీ రాజకీయంగా వాడుకుంటూ, ఆయనకు దేశ వ్యాప్తంగా ఇప్పుడు మద్ధతిస్తుందని కాంగ్రెస్ వివరిస్తుంది. అయితే, తెలంగాణ ప్రజలపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం ఉపేక్షేంచేవి కాదని తెలంగాణ సమాజంతో పాటు కాంగ్రెస్ మండిపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో పవన్‌ను తెలంగాణలో రాజకీయంగా వాడుకోవాలంటే ఇప్పుడు అతన్ని కాపాడుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తున్నదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పవన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు వరుసగా విమర్శల దాడికి దిగిన రోజున సీఎంపై వివాదం సృష్టించి బీజేపీ డైవర్ట్ పాలిటిక్స్‌కు తెరలేపిందని కాంగ్రెస్ నేతలు వివరిస్తున్నారు.
Also Read: BJP vs Congress: ప్రధాని తల్లి ఏఐ వీడియో రచ్చ.. దుమ్మెత్తిపోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఖండించలేరా?
దేవుళ్లను పూజించే విషయంలో ప్రజల విశ్వాసాన్ని విశ్లేషించిన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో ఎలాంటి వివాదం లేకపోయినా.. బీజేపీ దాన్ని వివాదాస్పదం చేయడానికే మొగ్గు చూపిందని కాంగ్రెస్ స్పష్టం చేస్తున్నది. పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా రక్షించడానికే బీజేపీ ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ పేర్కొంటుంది. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలను అవనమానించినా కూడా బీజేపీ కనీసం స్పందించడం లేదని కాంగ్రెస్ మండిపడుతుంది. బీజేపీని ప్రతి అంశంలో నిలదీస్తూ, ఆ పార్టీ మతతత్వ రాజకీయాలు తెలంగాణలో సాగనివ్వకుండా అడ్డుకుంటున్నందుకే సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ వివాదాన్ని తీసుకువచ్చినట్లు కాంగ్రెస్ స్పష్టం చేస్తుంది.
ముఖ్యమంత్రిగా తన రెండేళ్ల పాలనలో విస్తృత సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడం, తెలంగాణ అభివృద్ధితో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన విజన్‌తో ముందుకెళ్తుండడం బీజేపీకి రుచించడం లేదనే అభిప్రాయాలు కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్నాయి. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకి రేవంత్ రెడ్డి చేరువ అవుతున్న తీరును బీజేపీ జీర్ణంచుకోలేకపోతుందని కాంగ్ లీడర్లు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మేడారం అభివృద్ధి, వేములవాడ రాజన్న ఆలయాల అభివృద్ధి, గోశాలల నిర్మాణం వంటి చర్యలను ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేస్తుండడాన్ని బీజేపీ సహించలేకపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ గెలుపును జీర్ణించుకోలేకపోతున్న బీజేపీ!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించినా కూడా కులమతాలకు అతీతంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి జైకొట్టడం బీజేపీకి నిద్రపట్టనివ్వడం లేదని తెలుస్తోంది. దేశంలో ఏ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రి చేయలేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు విదేశీ సంస్థలను తీసుకొస్తుండడం, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్‌ను గమ్యస్థానంగా తీర్చిదిద్దడం, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరిస్తున్న తీరును చూసి బీజేపీ ఓర్వలేకపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రజల భావోద్వేగాలు పట్టని బీజేపీ స్వార్థ్య రాజకీయాల కోసమే సీఎం వ్యాఖ్యలపై రాజకీయం చేస్తోందనే చర్చ నడుస్తోంది. బీజేపీ తెలంగాణలో ఉనికి కోల్పోయిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
Also Read: Congress vs BJP: డీఎస్ విగ్రహావిష్కరణపై వార్.. దుమ్మెత్తిపోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్.. ఎందుకంటే?
