TG SPDCL: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) తమ కార్యకలాపాలలో సమర్థతను పెంచడానికి, విద్యుత్ నష్టాలను గణనీయంగా తగ్గించడానికి కీలకమైన ‘స్కాడా’ (సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్) వ్యవస్థను మరింత విస్తృతంగా అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. అత్యాధునిక సాంకేతికత వినియోగంతో పర్యవేక్షణను కట్టుదిట్టం చేసి, సంస్థలో సమూల మార్పులు తీసుకురావాలని యాజమాన్యం భావిస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో కొన్ని ప్రాంతాలకు పరిమితమైన స్కాడా వ్యవస్థను, సంస్థ పరిధిలోని అన్ని ముఖ్యమైన 33/11 కేవీ సబ్‌స్టేషన్లకు విస్తరించాలని ప్రతిపాదించారు. వచ్చే ఏడాది మార్చిలోగా ఈ విస్తరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కొత్తగా చేర్చే వివరాలు
ప్రస్తుతం స్కాడా పరిధిలో 222 కాగా, 33/11 కేవీ సబ్‌స్టేషన్లు ఉన్నాయి. త్వరలో మరో 146 సబ్ స్టేషన్లను కూడా స్కాడా పరిధిలోకి తీసుకురావాలని అధికారులు చూస్తున్నారు. అలాగే ప్రస్తుతం స్కాడా పరిధిలో 1981 ఉండగా, 11 కేవీ ఫీడర్లు ఉన్నాయి. కాగా, వీటికి అదనంగా త్వరలో మరో 953 ఫీడర్లను స్కాడా పరిధిలోకి తీసుకువచ్చేలా ఎస్పీడీసీఎల్ కసరత్తు చేస్తోంది. స్కాడా విస్తరణతో గ్రిడ్‌లోని ప్రతి కీలక పాయింట్ వద్ద విద్యుత్ ప్రవాహం, వోల్టేజ్, లోడ్ వివరాలు కంట్రోల్ సెంటర్‌కు రియల్ టైమ్‌లో అందుబాటులోకి వస్తాయి. దీంతో సాంకేతిక లోపాలను, విద్యుత్ దుర్వినియోగాన్ని తక్షణమే గుర్తించి సరిదిద్దడం ద్వారా విద్యుత్ అంతరాయాల సమయాన్ని తగ్గించవచ్చు. సంస్థ ఎదుర్కొంటున్న వాణిజ్య, సాంకేతిక నష్టాలకు ఈ వ్యవస్థ శాశ్వత పరిష్కారం చూపుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, విద్యుత్ దొంగతనాలను పర్యవేక్షణ కేంద్రం నుంచే పసిగట్టే అవకాశం ఉంటుంది.
Also Read: TGSRTC Modernization: త్వరలో హైదరాబాద్‌లో కాలుష్య రహిత ప్రచారం వ్యవస్థ
ఖర్చుల్లో భారీగా తగ్గింపు
స్కాడా విస్తరణతో సబ్‌స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే, నియంత్రణ కేంద్రం నుంచి సర్క్యూట్ బ్రేకర్లను నియంత్రించి నష్ట నివారణ చర్యలు చేపట్టవచ్చు. తద్వారా సిబ్బంది భౌతికంగా ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్లవలసిన అవసరాన్ని తగ్గించడం ద్వారా భద్రతను పెంచేలా ఈ వ్యవస్థ పనిచేయనుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సంస్థ పనితీరులో పారదర్శకత పెరిగి, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని, వినియోగదారులకు మరింత నాణ్యమైన, నిరంతరాయమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ఆస్కారం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. భవిష్యత్తులో స్మార్ట్ మీటర్లు, అడ్వాన్స్‌డ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఏడీఎంఎస్) ఏర్పాటుకు ఇది పునాదిగా ఉపయోగపడుతుందని ఎస్పీడీసీఎల్ భావిస్తోంది. ఈ నిర్ణయంతో అయినా విద్యుత్ సంస్థకు నష్టాలు తగ్గుతాయా? లేదా? అనేది చూడాలి.
Also Read: TG SPDCL: అవినీతిని సహించం. దక్షిణ తెలంగాణ విద్యుత్ సంస్థ సీరియస్!
