TGSRTC Modernization: హైదరాబాద్ లో కాలుష్యరహిత ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నగరవాసులను అనారోగ్యానికి గురి చేసే వాయు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సు(Electric bus)లను వినియోగించాలని టీజీఎస్ఆర్టీసీ(TGSRTC)ని ఆదేశించింది. హైదరాబాద్(Hyderabad) ఓఆర్ఆర్(ORR) లోపల 2027 నాటికి 2800 ఎలక్ట్రిక్ బస్సులను డీజిల్ బస్సుల స్థానే ప్రవేశ పెట్టాలని నిర్దేశించింది. నగరంలోని ప్రజా రవాణా వ్యవస్థను క్లీన్ అండ్ గ్రీన్ దిశగా నడిపించేందుకు ఈ నిర్ణయం ఒక శుభ సంకేతం. పర్యావరణ పరిరక్షణలో ఇది విప్లవాత్మక అడుగు.
యాజమాన్యం ఇప్పటికే చర్యలు..
పూర్తి స్థాయిలో 2800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు వినియోగంలోకి వస్తే వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లు తగ్గడంతో పాటు ప్రజా రవాణా వినియోగం పెరుగుతోంది. ఫలితంగా వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు తగ్గుతాయి. నగరవాసులకు శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు తగ్గి.. ప్రజల ఆయుర్థాయం మెరుగుపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో 2800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకునేందుకు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే చర్యలు చేపట్టింది. రాబోయే రెండేళ్లలో దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను వాడకంలోకి తెచ్చేలా ప్రణాళిక రూపొందించింది. ఎలక్ట్రిక్ బస్సులకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో 25 డిపోలున్నాయి. అందులో 6 డిపోల పరిధిలో 265 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా.. ఈ ఏడాదిలో మరో 275 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి.
Also Read: Maoist Surrender: మావోయిస్టులకు భారీ షాక్.. 103 మంది మావోయిస్టులు లొంగుబాటు
2800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..
ఒక్కో డిపోలో రూ. 8 కోట్ల వ్యయంతో పూర్తిస్థాయిలో చార్జింగ్ కోసం హెచ్‌టీ కనెక్షన్లను టీజీఎస్పీడీసీఎల్(TGSPDCL), ట్రాన్ కో ద్వారా నిర్మించింది. రాబోయే 2800 కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కోసం 19 డిపోల్లో చార్జింగ్ కోసం హెచ్‌టీ కనెక్షన్లను సంస్థ ఏర్పాటు చేయనుంది. అలాగే, ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా హైదరాబాద్ లో ప్రజా రవాణాను మరింతగా విస్తరించేందుకు కొత్తగా 10 డిపోలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే, కొత్తగా 10 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ మౌలిక సదుపాయాలకు రానున్న సంవత్సరంలో రూ.392 కోట్ల మేర వ్యయమవుతుందని టీజీఎస్ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు. టీజీఎస్ఆర్టీసీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆర్థిక భారాన్ని మొయలేదు. ప్రభుత్వం, ప్రజల సహకారంతో ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటోంది.
బస్సుల్లో అదనపు ఛార్జీలు
ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ బస్సుల మౌలిక సదుపాయాల వ్యయాన్ని సమకూర్చుకునేందుకు సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీని విధించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను సెప్టెంబర్ 23న రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో అదనపు ఛార్జీని సంస్థ వసూలు చేయనుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎస్ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎస్ప్రెస్ బస్సుల్లో మొదటి మూడు స్టేజిలకు రూ.5, 4వ స్టేజి నుంచి రూ.10 అదనపు ఛార్జీని సంస్థ విధించనుంది. అలాగే మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీని వసూలు చేయనుంది. హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఈ అదనపు చార్జీ అమలు ఈ నెల 6(సోమవారం) నుంచి అమల్లోకి వస్తుంది. హైదరాబాద్ భవిష్యత్ బాగు కోసం వాడకంలోకి తీసుకువస్తోన్న ఎలక్ట్రిక్ బస్సులను ప్రజలు ఆదరించాలని, నగర ప్రజా రవాణా ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చబోతున్న ఈ గ్రీన్ జర్నీలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని సంస్థ కోరుతోంది. ఈ పర్యావరణహిత కార్యక్రమానికి సహకరించి..గతంలో మాదిరిగానే ఆర్టీసీ సేవలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తోంది.
Also Read: Cheque Clearance: బ్యాంక్ చెక్కుల విషయంలో కొత్త రూల్.. శనివారం నుంచే అమల్లోకి
