Sharmila On Pawan: కోనసీమ కొబ్బరికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడటం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల అన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడటం.. ప్రజల మధ్య వైష్యమ్యాలను రెచ్చగొట్టినట్లే అవుతుందని ఎక్స్ వేదికగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు పవన్ బాధ్యతారాహిత్యానికి నిదర్శమని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టారు. అన్నదమ్ముల్లాంటి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్లీ ప్రాంతీయ విద్వేషాలను నింపొద్దని పవన్ కు విజ్ఞప్థి చేశారు.
‘మీకు సబబు కాదు’
సముద్రపు ఉప్పనీరు కారణంగా కోనసీమలోని శంకరగుప్తం ప్రాంతంలో కొబ్బరి చెట్లు దెబ్బతిన్నాయని వైఎస్ షర్మిల అన్నారు. వీటికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని షర్మిల విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చి దిష్టి మీద దానిని రుద్దడం సరికాదని పేర్కొన్నారు. ‘మూఢ నమ్మకాలను అడ్డం పెట్టుకుని ప్రజలను కించపరచడం ఉప ముఖ్యమంత్రిగా మీకు సబబు కాదు’ అని షర్మిల అన్నారు.
‘రూ.3500 కోట్లు కేటాయించండి’
కోనసీమ కొబ్బరిచెట్టుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉప్పునీటి ముప్పును తప్పించాలని షర్మిల సూచించారు. కొబ్బరి రైతుల కష్టాలకు తక్షణ పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. కొబ్బరి రైతులను ఆదుకునేందుకు వెంటనే రూ. 3,500 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించాలని పట్టుబట్టారు. అయితే పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలపై ఇప్పటివరకూ తెలంగాణకు చెందిన నేతలు మాత్రమే స్పందించారు. అయితే ఏపీ నుంచి స్పందించిన తొలి నేత షర్మిలే కావడం గమనార్హం.
కోనసీమ కొబ్బరికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan మాట్లాడటం బాధాకరం. ఇలాంటి మాటలు ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చ గొట్టడమే. ఇది పవన్ గారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. అన్నదమ్ముల్లాంటి ఆంధ్ర,…
— YS Sharmila (@realyssharmila) December 3, 2025
Also Read: Maoist Encounter: మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ.. బలగాల కాల్పుల్లో ఐదుగురు మృతి!
కవిత కూడా ఫైర్..
మరోవైపు కవిత సైతం పవన్ వ్యాఖ్యలపై స్పందించారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో కవిత మాట్లాడుతూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తొలి నుంచి తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నారని ఆరోపించారు. ‘తెలంగాణ నాయకుల దిష్టి కళ్లతో కోనసీమ పాడైందని ఆయన అంటున్నారు. తెలంగాణ ప్రజలు ఏనాడు దిష్టి పెట్టలేదు. కోనసీమ మాదిరిగా తెలంగాణ కావాలనుకున్నాం. తెలంగాణ బిడ్డల మనసు చాలా గొప్పది. మేము పెద్దగా ఆలోచిస్తాం. మా రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లు అయ్యింది. ఎప్పుడు కూడా జై తెలంగాణ, జై ఆంధ్రా అనే అన్నాం. తెలంగాణ ఎంత బాగుందో.. ఆంధ్రా కూడా అంతే బాగుండాలని కోరుకున్నాం’ అని కవిత అన్నారు.
