iBomma Ravi: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ పైరసీ సైట్ నిర్వాహకుడు ఇమంది రవి కేసు దర్యాప్తులో రోజుకో కొత్తకోణం వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరికొన్ని ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. ఐబొమ్మ రవిని విచారిస్తున్న క్రమంలో అతడికి పోలీసులు జాబ్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. వారి బిగ్ ఆఫర్ ను తిరస్కరించి అతడు చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
జాబ్ ఆఫర్.. రవి రియాక్షన్
ఐబొమ్మ రవిని ఇప్పటికే రెండుసార్లు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. సుదీర్ఘంగా అతడ్ని విచారించారు. విచారణ సందర్భం సైబర్ క్రైమ్ విభాగంలో అతడికి జాబ్ ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే పోలీసుల ఆఫర్ ను రవి సున్నితంగా తిరస్కరించారట. కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ పేరుతో రెస్టారెంట్ పెడుతున్నట్లు విచారణలో రవి చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఐ బొమ్మ ద్వారా వచ్చిన సంపాదనలో రూ.17 కోట్లు ఎంజాయ్ చేయడానికే ఖర్చు చేసినట్లు వెల్లడించాడట.
ఉల్లాసంగా గడపటమే లక్ష్యం
ఐబొమ్మ కథ ముగిసిన నేపథ్యంలో భవిష్యత్ ప్లాన్ ఏంటీ అని పోలీసులు ప్రశ్నించగా మరిన్ని విషయాలను రవి పంచుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల ముందు తన భవిష్యత్ ప్రణాళికను రవి వివరించినట్లు టాక్. కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ రెస్టారెంట్ ను ఏర్పాటు చేసి.. భారతీయ వంటకాలను అక్కడి వారికి పరిచయం చేస్తానని రవి చెప్పారట. అంతేకాదు ఆ దేశంలో మరిన్ని బ్రాంచ్ లు ఏర్పాటు చేస్తానని కూడా పేర్కొన్నాడట. సంపాదించిన డబ్బుతో ఉల్లాసంగా గడపటమే తన లక్ష్యమని.. కాబట్టి సైబర్ క్రైమ్ లో ఉద్యోగం చేయలేనని రవి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read: Kavitha On Pawan: ‘పక్కోడు బాగుంటే.. మా కళ్లు మండవు’.. పవన్‌కు కవిత స్ట్రాంగ్ కౌంటర్!
రవికి బెయిల్ వస్తుందా?
ఇదిలా ఉంటే కాసేపట్లో ఇమంది రవి బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే బెయిల్ కు సంబంధించి గత రెండ్రోజులుగా వాదనలు జరిగాయి. మరోవైపు రవిపై మెుత్తం నాలుగు కేసులు నమోదు కాగా.. వాటికి సంబంధించి ఇప్పటికే పీటీ వారెంట్ ను నాంపల్లి కోర్టు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అతడికి బెయిల్ ఇస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రవి పిటి వారెంట్ కేసులకు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు ఐదు రోజుల కస్టడీ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బెయిల్ వచ్చినా అతడు జైలుకు వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
