Seethakka: తెలంగాణ ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి సీతక్క(Seethakka) స్పష్టం చేశారు. ‘కోటి మంది మహిళలను కోటిశ్వర్లు’ చేసే కార్యక్రమాన్ని కీలకంగా తీసుకుని, ప్రతి మహిళకు ఆర్థిక భద్రత, డిజిటల్ జ్ఞానం, వ్యాపార అవకాశాలు, గ్లోబల్ మార్కెట్ చేరుకోవడానికి సహాయం చేసే చర్యలు ప్రారంభించిందన్నారు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్–2047 రూపకల్పనలో భాగంగా మహిళల సాధికారత, ఆర్థిక అభివృద్ధి, సంరక్షణ పోషకాహారం అంశాలపై చేపట్టాల్సిన కీలక చర్యలపై ప్రజాభవన్‌లో మంగళారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
2047 నాటికి 95 శాతానికి చేరేలా విజన్
మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణకు సంబంధించి విభిన్న అంశాలపై మంత్రి పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 52.7 శాతంగా ఉందని దాన్ని 2047 నాటికి 95 శాతానికి చేరేలా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేయాలని సూచించారు. మహిళల ఉపాధి–ఉద్యోగ అవకాశాలను విస్తృతంగా పెంచేందుకు సమగ్రమైన వ్యూహం ఉండాలని స్పష్టం చేశారు. మహిళల సంరక్షణ, పోషకాహారం ప్రధాన లక్ష్యాలుగా ఉండాలని పేర్కొన్నారు.
Also Read: Minister Seethakka: ఈశ్వరి బాయి స్ఫూర్తి చిరస్థాయి.. సీతక్కకు మెమోరియల్ అవార్డు ప్రదానం!
మహిళలను ప్రొత్సహించేలా విజన్ 2047 డాక్యుమెంట్
కోటి మంది మహిళలకు కోటిశ్వరులను చేసే లక్ష్యంతో విభిన్న వ్యాపారాల్లో మహిళలను ప్రొత్సహించేలా విజన్ 2047 డాక్యుమెంట్ ఉండేలా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మహిళా సంఘాల ద్వారా యూనిఫాంలు కుట్టించడాన్ని ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి ఏడాది మహిళా సంఘాలకు రూ.30కోట్లకు పైగా ఆదాయం లభిస్తోందని చెప్పారు. 2047 విజన్ ప్రకారం అన్ని మహిళలకు యూనివర్సల్ చైల్డ్ కేర్, యూనివర్సల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజ, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ పాల్గొన్నారు.
Also Read: Seethakka: ప్రతి మహిళకు బొట్టుపెట్టి ఇందిరమ్మ చీర ఇవ్వాలి.. ఆఫీసర్లకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు!
