Chennai Metro: చెన్నై నగరంలో మంగళవారం ఉదయం మెట్రో ప్రయాణికులు అసలు ఊహించలేని అనుభవాన్ని ఎదుర్కొన్నారు. వింకో నగర్ డిపో దిశగా సాగుతున్న బ్లూ లైన్ మెట్రో రైలు, సెంట్రల్ మెట్రో–హైకోర్టు స్టేషన్ల మధ్య టన్నెల్‌లో ఆకస్మాత్తుగా ఆగిపోవడంతో ప్రయాణికులు పట్టాల మీదుగా నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం, రైలు టన్నెల్‌లో ఆగిన వెంటనే రైల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రయాణికులు కొన్ని నిమిషాల పాటు చీకటిలోనే చిక్కుకుపోయారు. కొంతమంది కిటికీల దగ్గరికి చేరి బయట ఏమైందో చూడాలని ప్రయత్నించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తర్వాత మెట్రో సిబ్బంది అనౌన్స్‌మెంట్ చేస్తూ, రైలు నుండి దిగిపోవాలని, సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న హైకోర్టు మెట్రో స్టేషన్ వరకు టన్నెల్‌లో నడవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రయాణికులు నడుచుకుంటూ భద్రంగా స్టేషన్‌కు చేరారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలోకి కూడా వచ్చేశాయి.
ఈ అంతరాయం విద్యుత్ లోపం లేదా సాంకేతిక సమస్య కారణంగా జరిగి ఉండొచ్చని అంటున్నారు. అయితే, కొద్ది సేపటికే సమస్యను పరిష్కరించిన చెన్నై మెట్రో అధికారులు, బ్లూ లైన్ , గ్రీన్ లైన్ సర్వీసులు తిరిగి పూర్తిగా సాధారణ స్థితికి వచ్చాయని ప్రకటించారు. ” ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని మెట్రో రైల్ లిమిటెడ్” ఎక్స్ లో ట్వీట్ చేసింది.

