Local Body Elections: సర్పంచ్ స్థానాలపై ప్రధాన పార్టీలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. గెలిచే అభ్యర్థులపై దృష్టి సారించాయి. రాబోయే రోజుల్లో గ్రామాల్లో పట్టు కోసం ఇప్పటి నుంచే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. రేపటి వరకు మాత్రమే నామినేషన్ల గడువు ఉండడంతో రెబల్స్‌ను తప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీలు సైతం గ్రామాలవారీగా వివరాలు సేకరించి వారిని బుజ్జగిస్తున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకుంటే పదవులతోపాటు పనుల ఆఫర్ ఇస్తున్నట్లు సమాచారం.
ఒకే పార్టీ నుంచి నలుగురైదుగురు
రాష్ట్రంలో తొలి విడుతలో 4,236 గ్రామాల సర్పంచ్ స్థానాలకు 25,654 నామినేషన్లు, 37,440 వార్డులకు 82,276 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఒకే పార్టీ నుంచి నలుగురైదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. బరిలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు. గెలుపు కోసం ప్రయత్నాలు షురూ చేశారు. మరికొందరు అభ్యర్థులకు సపోర్టుగా వేసిన వారు సైతం పోటీకి సైతం సై అంటున్నారు. దీంతో వారిని విత్ డ్రా చేయించడం నాయకులకు పరీక్షగా మారింది. గెలిచే వారే బరిలో ఉండేలా కసరత్తు చేస్తున్నారు. నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. గ్రామాల వారీగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు కాంగ్రెస్,(Congress) బీఆర్ఎస్, (BRS) బీజేపీ (BJP) వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. కానీ, విత్ డ్రా అయ్యేందుకు నామినేషన్ వేసినా ససేమీరా అంటున్నట్లు సమాచారం. గ్రామంలో ఎవరికి మంచి పేరు ఉన్నది? ఎవరైతే విజయం సాధిస్తారు? పార్టీకి సైతం ఎలా కలిసి వస్తుందనే ఈక్వేషన్లు పరిశీలిస్తున్నారు. గ్రామాల్లో పట్టు కోసం మూడు పార్టీలు ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టాయి.
తగ్గేదే లేదంటున్న అభ్యర్థులు
పోటీలో పార్టీ గుర్తులు లేకపోయినప్పటికీ చాలామంది ఆసక్తి ఉన్న నేతలు ప్రతి గ్రామంలో నామినేషన్లు వేశారు. అయితే, నామినేషన్లు వేసిన అభ్యర్ధులంతా పార్టీలలో కీలకంగా పని చేస్తున్న వారే. ఇప్పుడు ఎవరు బరిలో ఉండాలి? అసలు అభ్యర్థి ఎవరు? రెబెల్ ఎవరు? అనేది తలనొప్పిగా మారింది. ఉపసంహరించుకోవాలని ఎవరిని కోరినా పార్టీకి మైనస్ అవుతుందని నేతలు భావిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు రెండు రోజులు మాత్రమే ఉండడంతో అసమ్మతి నేతలను చల్లబరిచేందుకు, డమ్మీ నామినేషన్లను విత్‌డ్రా చేయించేందుకు పార్టీల నేతలు రంగంలోకి దిగారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు బుజ్జగిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, మాజీ ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. బీజేపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు ఉపసంహరణకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే, తాము ఎన్నో ఏళ్లుగా కష్టపడి పని చేస్తున్నామని, ఇప్పుడు విత్ డ్రా చేసుకోమంటే ఎలా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచే ఎక్కువమంది పోటీకి సై అంటుండడం ఆ రెండు పార్టీలకు తలనొప్పిగా మారింది.
ఆఫర్ ఇస్తున్నా కూడా
నామినేషన్ల ఉపసంహరణకు నేతలు ఆఫర్ ప్రకటిస్తున్నట్లు సమాచారం. సర్పంచ్‌గా విజయం సాధిస్తే గ్రామంలో చేపట్టే పనులు ఇస్తామని, అభివృద్ధి పనులు సైతం ఇస్తామని కలిసి పని చేసుకుందామని హామీలు ఇస్తున్నారు. అంతేకాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో మాట్లాడిస్తున్నారు. వారితోనూ హామీలు ఇస్తూ నామినేషన్లు వేసే వారిని సముదాయిస్తున్నారు. అంతేకాదు నామినేషన్ విత్ డ్రా చేసుకుంటే భవిష్యత్‌లో పార్టీలో కీలక పదవులు ఇస్తామంటూ హామీ ఇస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మరో అడుగు ముందుకు వేసి నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులు సైతం ఆఫర్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అయితే రాబోయేది మన ప్రభుత్వమేనని, అందరిని గుర్తు పెట్టుకుంటామని, నామినేటెడ్, పార్టీ పదవులు ఇస్తామని హామీ ఇస్తున్నది.
జనరల్ స్థానాల్లో పోటీ తీవ్రం
మరోవైపు, జనరల్ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉన్నది. బీసీ, ఓసీలకు చెందిన ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని గ్రామాలు రిజర్వేషన్ల నుంచి జనరల్‌కు రావడంతో ఓసీలు ఈ స్థానాన్ని వదులుకోవద్దని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామంలో జనరల్ స్థానం వస్తే తాము పోటీ చేయకుండా అడ్డుకుంటున్నారని ఆయా వర్గాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే తాము రెబల్స్‌గా పోటీ చేస్తామని అంటున్నారు. అలాంటి చోట్ల అగ్రవర్ణ నేతలను బుజ్జగించడం నేతలకు టాస్క్‌గా మారింది. కొన్ని గ్రామాల్లో డ్రా తీసి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా పంచాయతీ ఎన్నికలను పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
Also Read:Local Body Elections: రాష్ట్రంలో నేటి నుంచి స్థానిక నామినేషన్లు.. గ్రామాల్లో జోరందుకున్న రాజకీయం
