DGP Shivadhar Reddy: రాష్ట్ర భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) చెప్పారు. దేశ, విదేశాల నుంచి దిగ్గజాలు రానున్న నేపథ్యంలో అలర్ట్‌గా ఉండాలని సూచించారు. చిన్నపాటి అవాంఛనీయ సంఘటన కూడా జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్లోబల్ సమ్మిట్‌తోపాటు భవిష్యత్ ప్రణాళికలపై డీజీపీ శివధర్ రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ యాక్ట్‌ను ప్రవేశ పెట్టటంపై ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
పోలీస్ శాఖలో టెక్నాలజీ డెవలప్‌మెంట్ యూనిట్‌ను ఏర్పాటు
పంచాయతీ ఎన్నికల అనంతరం సీనియర్, యువ అధికారుల బృందం సెక్యూరిటీ ఆపరేటింగ్ సెంటర్‌ను సందర్శించే షెడ్యూల్‌ను ఖరారు చేయాలని చెప్పారు. పోలీస్ (Police) శాఖలో టెక్నాలజీ డెవలప్‌మెంట్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఇన్నోవేషన్ ఇంక్యూబరేటర్ల కోసం టీ హబ్ ఓ హ్యాకథాన్‌ను నిర్వహించాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8,9 వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరుగనున్నదని చెబుతూ దీనికి ప్రపంచ స్థాయి పారిశ్రామిక వేత్తలు, దౌత్యాధికారులు, పెట్టుబడిదారులు, నిపుణులు, ప్రణాళికా నిపుణలు రానున్నట్టు డీజీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాని చెప్పారు. సమ్మిట్ ముగిశాక ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ప్రజల కోసం ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయన్నారు.
సైబర్ క్రైం ఫిర్యాదుల కోసం ఏఐ ఆధారిత వ్యవస్థ
రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్(Shikha Goyal) మాట్లాడుతూ, సైబర్, ఫోరెన్సిక్ సామర్థ్యాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి రూపొందించిన రోడ్ మ్యాప్‌ను వివరించారు. సైబర్ క్రైం ఫిర్యాదుల కోసం ఏఐ ఆధారిత డయల్ 1930 వ్యవస్థను అమలు చేయడం, రాష్ట్రవ్యాప్తంగా సైబర్ ఫోరెన్సిక్ హబ్‌లను విస్తరించడాన్ని లక్ష్యాలుగా పెట్టుకున్నట్టు తెలిపారు. రియల్ టైంలో మోసాలను గుర్తించే అటానమస్ ఫ్రాడ్ హంటింగ్ సిస్టం ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందప్ శాండిల్య మాట్లాడుతూ, లాగరిథమ్స్, అల్గారిథమ్స్, రోబోటిక్స్, ఏఐ ఆధారిత వ్యవస్థలపై దృష్టి సారించే ప్రత్యేక ‘పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్’ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
డయల్ 112 సేవలను మరింత బలోపేతం చేయాలి
పోలీస్ రోబోటిక్స్ ఆర్గనైజేషన్‌ను స్థాపించనున్నట్లు తెలిపారు. ఒంటరిగా నివసించే వృద్ధ పౌరులకు మద్దతుగా ‘డయల్ 112’ సేవలను మరింత బలోపేతం చేయాలన్నారు. సోషల్ మీడియా ధోరణులు, డార్క్ వెబ్/క్రిప్టో కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. తెలంగాణ పోలీస్ (Police) అకాడమీ డైరెక్టర్ శ్రీమతి అభిలాష బిస్త్ మాట్లాడుతూ, అధికారుల వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి భౌతిక, డిజిటల్ శిక్షణ మాడ్యూళ్లను సమగ్రంగా అనుసంధానించాలని సూచించారు. వాతావరణ సంబంధిత విపత్తులు, సాంకేతికత ఆధారంగా జరుగుతున్న నేరాలతోపాటు భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేక సైబర్, కంప్యూటర్, ఎల్ అండ్ ఓ నిపుణులను నియమించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
2047 నాటికి తెలంగాణ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాం
కొత్తగా పోలీస్ (Police) శాఖలోకి వచ్చే వారి శిక్షణను బలోపేతం చేయడానికి అకాడమీలో మినీ సీఎస్‌బీ యూనిట్‌ను స్థాపించనున్నట్లు తెలిపారు. ఐజీపీ రమేష్ మాట్లాడుతూ, 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవడంలో పోలీస్ వ్యవస్థదే కీలక పాత్ర అని అభిప్రాయపడ్డారు. శాంతిభద్రతల పరిరక్షణ ద్వారానే దేశీయ, విదేశీ పెట్టుబడులు వస్తాయన్నారు. ఈ సమావేశంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు మహేశ్ భగవత్, స్వాతి లక్రా, చారు సిన్హా, చంద్రశేఖర్ రెడ్డి, ఐజీ రమేశ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Also Read: DGP Shivadhar Reddy: డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై హైకోర్టులో పిటిషన్!
