DGP Shivadhar Reddy: రోడ్డు ప్రమాదాలు వందలాది కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిలిస్తున్నాయని డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) చెప్పారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో మీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు..ఇతరుల జీవితాలతో చెలగాటాలాడొద్దు అని సూచించారు. డిఫెన్సీవ్ డ్రైవింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అప్పుడే యాక్సిడెంట్లకు చెక్ పెట్టవచ్చని చెప్పారు. హైదరాబాద్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ ఆధ్వర్యంలో శుక్రవారం లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన అరైవ్…అలైవ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు, సినీ ప్రముఖులతో కలిసి అరైవ్…అలైవ్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
Also Read: DGP Shivadhar Reddy: దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ వన్ స్థానం: డీజీపీ శివధర్ రెడ్డి
రోడ్డు ప్రమాదాల నివారణను ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి
అనంతరం మాట్లాడుతూ ప్రతీ యేటా రాష్ట్రంలో 8వందల మంది హత్యలకు గురవుతుంటే దానికి పది రెట్లు ఎక్కువగా 8వేల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని చెప్పారు. ప్రతీ ఒక్కరూ దీనిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకే రాష్ట్రవ్యాప్తంగా అరైవ్…అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ కమిషనర వీ.సీ.సజ్జనార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణను ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు. హైదరాబాద్ లో ఏటా సగటున 3వేల యాక్సిడెంట్లు జరుగుతుంటే 3వందల మంది వరకు చనిపోతున్నారని తెలిపారు. చాలా యాక్సిడెంట్లకు ట్రాఫిక్ ఉల్లంఘనలే కారణమన్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
డ్రైవింగ్ చేసే సమయంలో తల్లిదండ్రులు భార్యాపిల్లలను గుర్తుంచుకోవాలి
ప్రమాదాల్లో ఎవరైనా గాయపడితే వారికి వెంటనే అవసరమైన సహాయాన్ని అందించాలన్నారు. సినీ నటుడు బాబూ మోహన్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో కన్నకొడుకును కోల్పోయానని భావోద్వేగానికి లోనయ్యారు. బాలల దినోత్సవం రోజున విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం సంతోషంగా ఉందని చెప్పారు. డ్రైవింగ్ చేసే సమయంలో తల్లిదండ్రులు భార్యాపిల్లలను గుర్తుంచుకోవాలన్నారు. ఎంతోమందిని నవ్వించిన తాను ప్రమాదంలో కొడుకును కోల్పయిన దుఖా:న్ని ఇప్పటికీ మరిచిపోలేక పోతున్నట్టు చెప్పారు. కార్యక్రమానికి ముందు ఇండియా గాట్ టాలెంట్ లో ప్రదర్శనలు ఇస్తున్న ముంబై ఆక్రోబాట్ బృందం చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఐపీఎస్ అధికారులు కే.రమేశ్, ఎం.రమేశ్ రెడ్డి, ఎం.శ్రీనివాసులు, జోయల్ డేవిస్, హీరోలు శర్వానంద్, ఆది సాయికుమార్, దర్శకుడు బుచ్చిబాబు, సింగర్స్ మనో, మోహన భోగరాజు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Local Body Elections: ఆ గ్రామపంచాయతీలకు ఎన్నికలు లేవు.. తేల్చిచెప్పిన ఎన్నికల కమిషనర్
