India Celebrates National Doctors Day On July 1: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా భారతదేశమంతటా ప్రతి సంవత్సరం జూలై 1న వైద్యులందరూ ఘనంగా జరుపుకుంటారు. జూలై 1న డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతిని పురస్కరించుకొని జూలై 1న భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవంగా పాటిస్తారు. డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ 1 జూలై 1882 న జన్మించాడు. 1962 లో అదే తేదీన మరణించాడు. బిధాన్ చంద్రరాయ్ వయస్సు 80 సంవత్సరాలు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి రెండవ సీఎంగా కూడా పనిచేశారు. 1961 ఫిబ్రవరి 4లో భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం, భారతరత్న పురస్కారంతో సత్కరించింది. ఆయన తన జీవిత పర్యంతం దేశీయ వైద్యరంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారు. వైద్యుల దినోత్సవమనేది కేవలం డాక్టర్ బి.సి.రాయ్‌కు నివాళి ప్రకటించడం మాత్రమే కాదు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, తమ వైద్యపరమైన నైపుణ్యాలతో ఎంతోమంది జీవితాలను మెరుగుదిద్దిన, ఎన్నో ప్రాణాలను కాపాడిన వైద్యులందరికీ అంకితం.
మనదేశంలో 1991 నుంచి జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహించుకోవడం ప్రారంభించారు. డాక్టర్ బి.సి.రాయ్ జాతీయ పురస్కారం మనదేశంలో వైద్యులకు బహూకరించే అత్యున్నత అవార్డు. 2017లో ఆ పురస్కార గ్రహీతనైన నాకు జాతీయ వైద్యుల దినోత్సవం మరింత ప్రత్యేకం. ఇది వైద్యరంగంలో సేవలు అందించేవారి నిబద్ధతకు గుర్తింపునిచ్చే, అంకితభావాన్ని ప్రశంసించే విశేషమైన రోజు.వైద్యోనారాయణో హరిః, వైద్యుడే భగవంతుడైన నారాయణుడైనా అని పిలుస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ భారతంలో వైద్యుడిని దైవసమానంగా భావిస్తారు. భారమంతా వైద్యుడిపైనే వేస్తారు. తమ జీవితాలను సంపూర్ణంగా వైద్యుల చేతిలో పెడతారు. తమ సొంత కుటుంబసభ్యులకు సైతం వెల్లడించని రహస్య సమాచారాన్ని వైద్యులకు మాత్రమే తెలిపే సందర్భాలు ఉంటాయి.
Also Read: బాలరాముడి బాణానికి ప్రత్యేక పూజలు
తమ శరీరాన్ని పరీక్షించేందుకు నిరభ్యంతరంగా అంగీకరిస్తారు. తమకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తికి శస్త్రచికిత్స చేసేందుకు శరీరాన్ని అప్పగిస్తారు. ఈ స్థాయిలో నమ్మకం, విశ్వాసాన్ని పొందడమనేది మరే ఇతర వృత్తిలోనూ ఉండకపోవచ్చు. ప్రజల నుంచి ఇంతగా విశ్వాసాన్ని పొందుతున్న వైద్యవర్గం ఎల్లప్పుడూ దానికి తగినంత విలువ ఇవ్వాలి. తమపై పెట్టుకొన్న నమ్మకాన్ని కాపాడుకోవాలి. అందుకని వైద్యులు అత్యున్నతస్థాయి నైతిక వర్తనతో తమ విధులపట్ల అత్యంత అంకితభావాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, వైద్యులు తాము అత్యంత ప్రశస్తమైన స్థానంలో ఉన్నామన్న విషయాన్ని అనుక్షణం గుర్తుంచుకొని మెలగాలి. అయితే కొన్ని సంవత్సరాలుగా పలు కారణాల వల్ల వైద్యులు, రోగుల మధ్య సంబంధాల్లో పరస్పర విశ్వాసం సన్నగిల్లుతుండటం విషాదకరం. సడలుతున్న నమ్మకాన్ని పునరుద్ధరించుకొనే బాధ్యత వైద్యులు, రోగులు ఇరువర్గాలపైనా ఉందన్నది వాస్తవం. ఇటువంటి అద్వితీయ అనుబంధాన్ని బలోపేతం చేసుకొనేందుకు వైద్యుల దినోత్సవం కన్నా మంచి తరుణం దొరకదు.