CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్నారు. మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీల పరిధిలో రూ. 151.92 కోట్ల అభివృద్ధి పనులకు ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో రూ. 15 కోట్లతో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులకు రేవంత్ శ్రీకారం చుట్టారు. అలాగే రూ. 121.92 కోట్లతో ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు డ్యాం దిగువన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటు, రూ.15 కోట్లతో అమరచింత మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులను రేవంత్ స్వయంగా ప్రారంభించారు.
మేడారం పనులపై సమీక్ష
అంతకుముందు సీఎం రేవంత్ తన నివాసంలో మేడారం అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఉండి పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని.. ఏ మాత్రం పొరపాట్లు దొర్లినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. రాతి పనులతో పాటు రహదారులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గద్దెల చుట్టూ భక్తుల రాకపోకలకు సంబంధించిన మార్గాలు, భక్తులు వేచి చూసే ప్రదేశాలు ఇలా ప్రతి ఒక్క అంశంపైనా అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు చేశారు.
‘జాగ్రత్తలు పాటించండి’
మరోవైపు మేడారం పనులు సాగుతున్న తీరుపై అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. వాటిని పరిశీలించిన ముఖ్యమంత్రి పలు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ, దేవాదాయ శాఖ, అటవీ శాఖ, స్థపతి శివనాగిరెడ్డి సమన్వయంతో సాగాలని సీఎం సూచించారు. అభివృద్ధి పనుల్లో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు పెద్ద పీట వేయాలని తెలిపారు. నిర్దేశిత సమయంలోనే అభివృద్ధి పనులు పూర్తి కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Also Read: Shocking Video: 20 అడుగుల గోడ దూకి.. సింహాల బోనులోకి వెళ్లాడు.. తర్వాత ఏమైదంటే?
‘తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వండి’
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Rvath Reddy) హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) ఛైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠ(Sanjay Kulshreshtha)ని కోరారు. హైదరాబాద్‌కు వచ్చిన కలశ్రేష్ఠను జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్), రేడియల్ రోడ్ల నిర్మాణాలకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరు, అమరావతి మీదుగా చెన్నై వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారులు, బందరు పోర్ట్ వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రహదారి, బుల్లెట్ ట్రైన్ నిర్మాణాలపై చర్చించారు.
