Kishan Reddy: మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించలేమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పష్టంచేశారు. ఎందుకంటే ఏ ఫెస్టివల్ కు కూడా ఎవరూ జాతీయ హోదాను కల్పించలేదని, అది ఇక్కడే కాదు.. ఏ దేశంలో అయినా ఈ విధానం లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా తొలుత వరంగల్ రైల్వేస్టేషన్ క్యాంటీన్‌లో చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్ర మంత్రికి పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెయ్యి స్తంభాల గుడికి చేరుకొని గతంలో తాను సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మంజూరు చేసిన అభివృద్ధి పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలి
అనంతరం రుద్రేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం కిషన్ రెడ్డి (Kishan Reddy) గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పేయితో పాటు ఉన్నతాధికారులతో కలిసి హరిత ప్లాజాలో సమీక్ష నిర్వహించారు. కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(కుడా) పరిధిలోని వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెయ్యి స్తంభాల గుడి ఆవరణలో బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలని అధికారులను కిషన్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులు ఆలస్యంపై అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
Also Read: Kishan Reddy: ప్రతి తలసేమియా బాధితులకు భారీ ఆర్థిక సాయం: కిషన్ రెడ్డి
భూ సేకరణ పూర్తికాగానే ప్రధాని మోదీతో భూమి చేయిద్దాం
పాత మట్టి కోటపై తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీశారు. భద్రకాళి ఆలయ పరిధిలో టూరిజం డెవలప్ మెంట్ కు సంబంధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. మామునూరు ఎయిర్ పోర్టు భూ సేకరణకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూ సేకరణ పూర్తికాగానే ప్రధాని మోదీతో భూమి చేయిద్దామని అధికారులకు ఆయన తెలిపారు. కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్కుకు సంబంధించి భూమి వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఏఎస్సై, జీడబ్ల్యూఎంసీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి రిపోర్ట్ ఇవ్వాలని కిషన్ రెడ్డి ఆదేశించారు. అనంతరం కాజీపేటలోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను సంభంధిత అధికారులతో కలిసి సందర్శించారు పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Also Read: Kishan Reddy: త్వరలో అందుబాటులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్: కిషన్ రెడ్డి

