Sadabainama: సాదాబైనామాల క్రమబద్దీకరణకు గ్రహణం పట్టింది. భూమి అమ్మినవారి నుంచి ఆఫిడవిట్ తీసుకోవాలనే నిబంధన పెట్టడంతో అడ్డంకిగా మారింది. దీంతో రైతులకు నిరాశే మిగిలింది. ఆ నిబంధన తొలగిస్తే తప్ప సాదాబైనామాలకు మోక్షం కలిగేటట్లు లేదు. రైతులకు సైతం మేలు జరుగుతుంది. అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. రైతుల పక్షాన ఆలోచిస్తుందా? లేదా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
జీవోలో స్పష్టం..
రాష్ట్రంలో భూ భారతి-2025 ప్రకారం సాదాబైనామాల క్రమబద్దీకరణకు సెప్టెంబర్ లో ఉత్తర్వులు జారీ చేసింది. 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 11 వరకు దాఖలైన అప్లికేషన్ల వరకే రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించారు. భూభారతి చట్టం-2025 సెక్షన్6(1) ప్రకారం అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించారు. రైతులు సాదాబైనామాలతో కొనుగోలు చేసిన భూములను వారి పేరిట మ్యుటేషన్ కి అవకాశం కల్పించింది. 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికే కొనుగోలు చేసినట్లుగా డాక్యుమెంట్లు ఉంటేనే పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించింది. ఆ తర్వాత కొనుగోలు చేసిన వారికి అవకాశం లేదని జీవోలో స్పష్టం చేసింది. ఆర్డీఓ స్థాయి అధికారికి క్రమబద్దీకరణ అధికారులను అప్పగించింది. సాదాబైనామాల క్రమబద్దీకరణ కోసం చేసుకున్న 9,00,894 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. తహసీల్దార్లు క్షేత్రస్థాయి విచారణ నిర్వహించి దస్త్రాన్ని ఆర్డీవోకు పంపాల్సి ఉంటుంది. అర్హత ఉన్న వారికి క్రమబద్ధీకరించి పట్టాలు అందజేస్తారు. ఇందులో భాగంగా, కొనుగోలుదారులకు, విక్రయదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఆతర్వాతేనే కొనుగోలు చేసిన వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఇంతవరకు భాగానే ఉంది. కానీ భూభారతి చట్టంలో కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి అఫిడవిట్ ఖచ్చితం అనే నిబంధన పెట్టింది. దీంతో సాదాబైనామాలకు గ్రహణం పట్టింది.
సాదాబైనామాలతోనే కాలం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చింది. ఈ పోర్టల్ రైతులను ఇబ్బందులకు గురిచేసింది. నలుబైయాబై ఏళ్ల క్రితం భూమిని అమ్మినవారి పేరితో ఈ ధరణిలో భూములు వచ్చాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూనే వస్తున్నారు. నాడు భూములను కొనుగోలు చేసిన రైతులు ఆ భూములను తమ పేరుపై నమోదు చేయించుకోకపోవడం, సాదాబైనామాలతోనే కాలం వెళ్లదీయడంతో ఇప్పుడు గుదిబండగా మారింది. నాడు అమ్మినవారి కొంతమంది ఉన్నప్పటికీ అఫిడవిట్ ఇవ్వడానికి నిరాకరించడం, చనిపోయిన వారి కటుంబ సభ్యులు ఆ భూమి తమదేనంటూ కోర్టులకు ఎక్కడంతో లబోదిబో అంటున్నారు. భూముల ధరలు భారీగా పెరిగిన కొన్ని ప్రాంతాల్లో, రికార్డుల్లో యజమానులుగా ఉన్న వ్యక్తులు క్రమబద్ధీకరణకు సహకరించడానికి ఎకరాకు కొంత ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే భూభారతి చట్టం వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కారం అవుతాయి.. సాదాబైనామాలను క్రమబద్దీకరణ చేస్తారని భావించినప్పటికీ నిరాశే మిగులుతుంది. భూమి అమ్మినవ్యక్తులు అఫిడవిట్ ఇచ్చేందుకు నిరాకరిస్తుండటంతో రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతం.
Also Read: Seed Corporation: నాటి బీఆర్ఎస్ నిర్లక్ష్యం.. తగ్గిన విత్తన ధృవీకరణ విస్తీర్ణం
జమాబందీ నిలిచిపోవడం
ఇది ఇలా ఉంటే చాలామంది రైతుల వద్ద ఒప్పంద పత్రం మినహా ఇతర పహాణీలు లేదా శిస్తు రసీదులు వంటి పక్కా ఆధారాలు లేవు. 2016 తర్వాత జిల్లాల్లో జమాబందీ నిలిచిపోవడంతో పహాణీల్లోనూ సరైన సమాచారం అందుబాటులో లేకుండా పోయింది. చాలాచోట్ల భూములు కొనుగోలుదారుల ఆధీనంలో ఉన్నా, రెవెన్యూ రికార్డుల్లో మాత్రం విక్రయించిన యజమానుల పేర్లే కొనసాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఇలా జిల్లాల్లో ఈ యజమానులు ఇప్పుడు క్రమబద్ధీకరణకు అభ్యంతరం చెబుతున్నారు.
సాదాబైనామాలకు మోక్షం
సాదాబైనామాల క్రమబద్దీకరణకు ఒకటే మార్గమని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. గ్రామసభలు నిర్వహించి.. సాదాబైనామా క్రమబద్దీకరణకు చేసుకున్న వ్యక్తి సంబంధిత భూమిని సాగుచేస్తున్నాడా? ఆయన ఆధీనంలో ఉందా? ఉంటే ఎప్పటి నుంచి సాగుచేస్తున్నాడు అనే వివరాలను సేకరించి అందరి సమక్షంలోనే క్రమబద్దీకరణ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు సాదాబైనామా రాసుకున్నప్పుడు ఆ పేపర్ పై సాక్షులు ఎవరెవరూ సంతకాలు పెట్టారో వారిని పంచనామా చేసి వాస్తవం అని రుజువు అయితే అతడి పేరుపై రిజిస్ట్రేషన్ చేస్తే బాగుంటుందని పలువురు మేధావులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే సాదాబైనామాలకు మోక్షం కలుగుతుంది. లేకుంటే కొనుగోలు చేసిన రైతులు నష్టపోయే అవకాశం ఉంది. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని సాదాబైనామాల క్రమబద్దీకరణ చేస్తుందా? లేకుంటే గత ప్రభుత్వం మాదిరిగానే కాలం వెళ్లదీస్తుందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గ్రామసభలో సాదాబైనామాలకు శ్రీకారం చుడితే రాష్ట్రంలో 9లక్షల మంది రైతులకు ఊరట కలుగుతుంది. క్రమబద్ధీకరణ పూర్తయితే రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు జారీ కావడంతో పాటు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్లు- మ్యుటేషన్ల ద్వారా ఆదాయం రానుంది.
Also Read: Telangana Cabinet: సీఎం రేవంత్ సంచలనం.. ఆ ఐదుగురు మంత్రుల తొలగింపు.. కొత్తవారికి ఛాన్స్..!

