Tummala Nageswara Rao: యాసంగి సీజన్‌కు సరిపడా యూరియా నిల్వలు ముందస్తుగానే అందుబాటులో ఉండేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. బుధవారం సచివాలయంలో పత్తి కొనుగోళ్లు, యూరియా సరఫరా, గతేడాది జొన్న నిల్వలు, శాటిలైట్ మ్యాపింగ్‌పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత రబీ సీజన్‌లో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన జొన్నలను ఎక్కువ కాలం నిల్వ చేయకుండా, మంచి ధర వచ్చిన వెంటనే వాటిని తరలించాలని అధికారులను ఆదేశించారు. ఖాళీ గోదాములను రైతులకు ఇతర ఉత్పత్తుల నిల్వల కోసం ఉపయోగించాలన్నారు. రబీ కోసం ప్రతినెలా 2 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గకుండా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరామని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 4 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 3.05 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయిందని, మిగిలిన యూరియా కూడా రాష్ట్రానికి సరఫరా అయ్యే విధంగా కేంద్ర రసాయనాల శాఖ అధికారులతో మాట్లాడాలని ఆదేశించారు. రబీ ముగిసే సమయం వరకు వరంగల్ రేక్ పాయింట్‌ను కొనసాగించాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రికి లేఖ రాసినట్టు తెలిపారు. అలాగే, రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి 100 శాతం కేటాయింపులు రాష్ట్రానికి జరిగేలా చూడాలని లేఖలో కోరామన్నారు.
ఇబ్బందులు ఉండొద్దు..
జనవరి వరకు కనీసం 3.50 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్‌తో రబీ కోసం రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రెగ్యులర్‌గా వచ్చే యూరియా సరఫరాలతో రైతులకు యూరియా పంపిణీ చేయడంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడవచ్చన్నారు. అన్ని జిన్నింగ్ మిల్లులను ప్రారంభించడం జరిగిందని, పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. స్లాట్ బుకింగ్‌లో రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు 2.63 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని సేకరించినట్టు అధికారులు మంత్రికి వివరించారు. శాటిలైట్ చిత్రాల ద్వారా సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసే సాంకేతికతను త్వరగా అందుబాటులోకి తెచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. రబీ సీజన్ రైతు భరోసా అందించే సమయానికి ఈ సాంకేతికతను పూర్తిగా వినియోగంలోకి తేవాలని, తద్వారా సాగు విస్తీర్ణం ప్రకారం రైతు భరోసా నిధులు జమ చేయడం సులభం అవుతుందని తుమ్మల స్పష్టం చేశారు.
Also Read: Hydra: ‘చెరువుల పునరుద్ధరణ అద్భుతం’.. హైడ్రాపై కర్ణాటక బృందం ప్రశంసలు
