Local Body Elections: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. తొలివిడుత ఎన్నికలకు గురువారం నుంచి నామినేషన్లు ప్రారంభం అవుతున్నాయి. జిల్లా ఎన్నికల అధికారులు ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి ఆటంకాలు కలుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను అధికారులు తీసుకుంటారు. రాష్ట్రవ్యాప్తంగా 12,728 సర్పంచు స్థానాలు, 1,12,288 వార్డులకుగాను.. తొలివిడతలో భాగంగా డిసెంబర్ 11న 4,236 సర్పంచ్, 37,440 వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. శనివారం వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 30న నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ) చేస్తారు. తిరస్కరించిన నామినేషన్లపై డిసెంబర్1న సాయంత్రం వరకు అప్పీల్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2న అప్పీల్ పరిష్కరిస్తారు. 3న మధ్యాహ్నం3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదేరోజు మధ్యాహ్యం 3 గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. అదే సమయంలో ఉపసర్పంచ్ ఎన్నిక ప్రక్రియను సంబంధిత విభాగాలు పూర్తిచేస్తారు.
రిటర్నింగ్ ఆఫీసర్లుగా..
అన్ని గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణ కాకుండా మూడు, నాలుగు గ్రామాలను కలిపి ఒక ‘క్లస్టర్’గా ఏర్పాటు చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా క్లస్టర్ కేంద్రాల్లోనే తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆయా కేంద్రాల్లో పంచాయతీల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు గెజిటెడ్ హోదా కలిగిన అధికారులను రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్వోలు), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా (ఏఆర్వోలు) నియమించారు. నామినేషన్ల స్వీకరించడంతోపాటు అభ్యర్థుల నుంచి క్యాష్ డిపాజిట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు నామిషన్లకు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారా..? లేదా పరిశీలించి నిబంధనల ప్రకారం లేకపోతే సంబంధిత అభ్యర్థికి వివరాలు చెప్పి, సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తెప్పించనున్నారు. అదే విధంగా అభ్యర్థులు దాఖలు చేసే నామినేషన్తోపాటే డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. సర్పంచ్ పదవికి పోటీచేసే ఎస్సీ(SC), ఎస్టీ(ST), బీసీ(BC) అభ్యర్థులు రూ.వెయ్యి, ఇతరులు రూ.2 వేల డిపాజిట్ చేయాలి. వార్డు సభ్యుడి పదవికి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల నామినేషన్ రుసుం కింద రూ.250, ఇతరులు రూ.500 చెల్లించాలి. అభ్యర్థులు డిపాజిట్ క్యాష్ రూపంలో ఆర్వోకు చెల్లిస్తే రసీదు ఇస్తారు. ఆ రసీదును నామినేషన్ పత్రానికి జోడించాల్సి ఉంటుంది.
Also Read: Bigg Boss Telugu 9 Winner: ఇప్పటి వరకు పూర్తయిన గేమ్‌ని గమనిస్తే.. విన్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందంటే?
ఎన్నికల ప్రక్రియ
చెక్‌పోస్టుల్లో వాహన తనిఖీలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని అధికారులకు ఈసీ(EC) ఆదేశాలు ఇచ్చింది. జిల్లాలో మాన్‌పవర్ మేనేజ్‌మెంట్, బ్యాలెట్ బాక్సుల(Ballot box) సమన్వయం, ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, శిక్షణా కార్యక్రమాలు, మెటీరియల్ మేనేజ్‌మెంట్, ఖర్చుల పర్యవేక్షణ, మీడియా కమ్యూనికేషన్, హెల్ప్‌లైన్, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వంటి విభాగాల బాధ్యతలను నోడల్ అధికారులకు అప్పగించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడంలో ప్రతి నోడల్ అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు.
పకడ్బందీ ఏర్పాటుచేయాలి
పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారులు, సీపీ, ఎస్పీలకు ఎస్ఈసీ రాణి కుముదిని ఆదేశించారు. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ సృజన, అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్ తో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ, బందోబస్తుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లపై ఆరా తీశారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా చూడాలని పోలీసు అధికారులకు సూచించారు. అన్ని దశల ఎన్నికలకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. పోలింగ్ సిబ్బందిని నియామకం, వారికి ట్రైనింగ్ పూర్తిచేయాలని సూచించారు.
గ్రామాల్లో మొదలైన ఎన్నికల కోలాహలం
తొలి విడుత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం కావడంతో గ్రామాల్లో కోలాహలం మొదలైంది. ఎవరు పోటీచేయాలనేదానిపై కసరత్తు చేస్తున్నారు. పోటీచేసేందుకు ఆసక్తి ఉన్న నేతలు సంప్రదింపులు మొదలు పెట్టారు. పోటీకి ఎక్కువ మంది చూపుతున్న గ్రామాల్లో పార్టీల సీనియర్ నేతలు సమావేశమైన ఒకరిని ఎంపిక ప్రక్రియ షురూ చేశారు. వార్డుల్లో ఎవరు పోటీచేయాలనేదానిపైనా చర్చిస్తున్నారు.
Also Read: Konda Surekha: వన్యప్రాణి సంరక్షణలో.. తెలంగాణ దేశానికి ఆదర్శం.. మంత్రి కొండా సురేఖ!
