AP New Districts: ఏపీలో కొత్తగా మరో మూడు జిల్లాలు ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మార్కాపురం (Markapuram), మదనపల్లె (Madanapalle), పోలవరం (రంపచోడవరం కేంద్రంగా) జిల్లాలను ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. అంతకుముందు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జిల్లాల పునర్విభజనపై సచివాలయంలో కీలక భేటి జరిగింది. ఈ సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం ఓకే చెప్పడంతో పాటు పలు మార్పులు సైతం సూచించారు. రాష్ట్రంలో మరో 5 రెవెన్యూ డివిజన్లు (Revenue Divisions) సైతం ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకరించడం విశేషం.
అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి (Nakkapalli), ప్రకాశం జిల్లాలోని అద్దంకి (Addanki) రెవెన్యూ డివిజన్ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అలాగే కొత్తగా ఏర్పాటు కాబోయే మదనపల్లె జిల్లాలోని పీలేరు (Pileru), నంద్యాల జిల్లాలోని బనగానపల్లె (Banaganapalle), సత్యసాయి జిల్లాలోని మడకశిర (Madakasira)ను సైతం రెవెన్యూ డివిజన్లుగా అప్ గ్రేడ్ చేయాలని సూచించారు. మరోవైపు కర్నూలు జిల్లాలోని అదోని మండలాన్ని విభజించేందుకు సైతం ఈ భేటిలో సీఎం ఒప్పుకున్నారు. పెద్దహరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. కాగా ప్రస్తుతం ఏపీలో 26 జిల్లాలు ఉండగా.. మరో 3 జిల్లాలు చేరితే వాటి సంఖ్య 29కి చేరుతుంది.
Also Read: iBomma Ravi Case: ఐబొమ్మ ఎలా పనిచేస్తుందో.. కళ్లకు కట్టిన ఏసీపీ.. వెలుగులోకి మరిన్ని నిజాలు
మరోవైపు రాయలసీమలో పండ్ల తోటల పెంపకం, సాగు సబ్సిడీ, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర అంశాలపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పూర్వోదయ పథకంలో భాగంగా రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు. రాయలసీమలోని పండ్లతోటల రైతుల ఆదాయం పెంచేందుకు రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్ల ద్వారా హార్టికల్చర్ సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. 5.98 లక్షల మంది ఉద్యాన రైతులకు మరింత లబ్ధి కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
