Army Officer Case: క్రిస్టియన్ ఆర్మీ ఆఫీసర్‌పై సుప్రీం కీలక తీర్పు
Army-Officer (Image source X)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Army Officer Case: గురుద్వారాలోకి ప్రవేశించని క్రైస్తవ ఆర్మీ ఆఫీసర్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Army Officer Case: ఓ గురుద్వారా గర్భగుడిలోకి ప్రవేశించడానికి నిరాకరించి, తొలగింపు వేటుకు గురైన ఒక క్రిస్టియన్ ఆర్మీ ఆఫీసర్ కేసులో (Army Officer Case) సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం కీలకమైన తీర్పు ఇచ్చింది. ఆర్మీలో కొనసాగేందుకు ‘తగని వ్యక్తి’ (Misfit) అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తోటి (సిక్కు) సైనికుల విశ్వాసాలను గౌరవించలేని ఆ అధికారిని తొలగిస్తూ సాయుధ దళాలు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్టు తెలిపింది. ‘‘సదరు అధికారి ఎప్పుడూ గొడవలు పెట్టుకునేవాడిలా ఉన్నాడు. ఎలాంటి సందేశం పంపుతున్నాడు?. ఆర్మీ అధికారిగా గురుద్వారాలోకి ప్రవేశించకపోవడం ఘోరమైన క్రమశిక్షణా రాహిత్యం. అతడిని తొలగించి ఉండాల్సింది. ఇలాంటి కయ్యాలమారి వ్యక్తులు సైన్యంలో ఉండాల్సిన అవసరం ఉందా?’’ అని నూతన ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అతనొక అద్భుతమైన అధికారి అయితే కావచ్చు, కానీ ఇండియన్ ఆర్మీలో పనిచేయడానికి సరిపోడని విమర్శలు గుప్పించింది. ప్రస్తుత తరుణంలో సాయుధ దళాలపై గురుతరమైన బాధ్యతలు ఉన్నాయని, ఇలాంటి విషయాలను తాము అస్సలు ప్రోత్సహించదలుచుకోలేదని ధర్మాసనం సూటిగా చెప్పింది.

అసలేంటీ కేసు?

గతంలో 3వ కావల్రీ రెజిమెంట్‌లో (అశ్విక దళం) లెఫ్టినెంట్‌గా పనిచేసిన శామ్యూల్ కమలేశన్ అనే అధికారి, గురుద్వారాలోకి ప్రవేశించేందుకు నిరాకరించారు. పూజ నిర్వహించేందుకు గురుద్వారా గర్భగుడిలోకి అడుగుపెట్టేందుకు పైఅధికారి ఆదేశాన్ని పాటించలేదు. ఇలా చేయడం, సైనిక క్రమశిక్షణను ధిక్కరించినట్టు అయింది. దీంతో, బాధ్యతల నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. గురుద్వారా గుర్భగుడిలో అడుగుపెట్టడం తన క్రైస్తవ విశ్వాసాలను ప్రభావితం చేస్తుందని కమలేశన్ వాదించాడు. కమలేశన్ తన పైఅధికారి చట్టబద్ధమైన ఆదేశం కంటే, తను ఆచరిస్తున్న మతానికే ప్రథమ స్థానం ఇచ్చాడని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు ఈ ఏడాది మే నెలలో ఆర్మీ నిర్ణయాన్ని సమర్థించింది. ఇది స్పష్టమైన క్రమశిక్షణా రాహిత్యం అని కోర్టు తీర్పు చెప్పింది. కమలేశన్ చర్య సైనిక నైతికత ఉల్లంఘన అని కోర్టు విమర్శించింది.

Read Also- Thaman Trolls: సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న థమన్ సాంగ్స్!.. కారణం ఇదేనా?

యూనిఫామ్‌‌ను కూడా అలాగే భావించాలి

ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పు వెలువరించిన సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ మాజీ సైనికుడు తన పాస్టర్ సలహాను కూడా ధిక్కరించాడని జడ్జి బాగ్చి వ్యాఖ్యానించారు. ‘‘మీ మత బోధకుడు మీకు సలహా ఇచ్చినప్పుడు, దానిని మీరు దాన్ని అంగీకరించాలి. అంతేగానీ, మతం దేనికి అనుమతిస్తుందనేది సొంత అవగాహనతో నిర్ణయించుకోకూడదు. ఆర్మీ యూనిఫామ్ ధరించి ఉన్నప్పుడు కూడా ఇదే వర్తిస్తుంది’’ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

కమలేశన్ తరపున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదించారు. ఒకే ఒక్క ఉల్లంఘనకు ఆర్మీ నుంచి ఆయనను తొలగించారని, కమలేశన్ గతంలో హోళీ, దీపావళి వంటి పండుగలలో పాల్గొన్నాడని, తద్వారా ఇతర మతాల పట్ల తన గౌరవాన్ని చాటిచెప్పాడని సమర్థించే ప్రయత్నం చేశారు. కమలేశన్ గర్భగుడికి సరిగ్గా బయట నిలబడ్డాడని, బయట ఏ పని చేయమన్నా చేస్తానని ఉన్నతాధికారితో కమలేశన్ చెప్పాడని, ఒక్క గర్భగుడిలోకి మాత్రమే ప్రవేశించనని అన్నాడంటూ న్యాయవాది వాదించారు. ఒక్క ఆ ఉన్నతాధికారికి మాత్రమే కమలేశన్‌తో సమస్య ఉందని ఆరోపించారు. సైన్యంలో చేరిన తర్వాత ఎవరూ వారి మతపరమైన గుర్తింపును కోల్పోరని న్యాయవాది అన్నారు. అయినప్పటికీ, ఈ వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు.

Just In

01

Xiaomi: ప్రీమియం ఫీచర్లతో త్వరలో లాంచ్ కానున్న రెడ్‌మి నోట్ 15 సిరీస్

Bigg Boss9: ఏం ఫన్ ఉంది మామా ఈ రోజు బిగ్ బాస్‌లో.. అందరూ పర్ఫామెన్స్ అదరుగొట్టేశారు..

Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఇక బుకింగ్..!

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం