Khammam Farmers: పట్టాదారు రికార్డుల్లో స్పష్టంగా ఉన్నప్పటికీ, తమ భూమి క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని గువ్వలగూడెం గ్రామానికి చెందిన రైతు దంపతులు తీవ్ర ఆందోళనకు దిగారు. న్యాయం కోరుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద నేలపై పడుకుని వినూత్న నిరసన వ్యక్తం చేశారు. గువ్వలగూడెం గ్రామానికి చెందిన కొలిపాక రామదాసు, భారతమ్మ దంపతులకు సర్వే నెంబర్ 229లో 2 ఎకరాల 36 గుంటల భూమికి సంబంధించిన రికార్డులు ఉన్నాయి. అయితే, తమ భూమిలో సుమారు 36 గుంటల భూమి తక్కువగా ఉందని, అది ఎక్కడుందో అధికారులు చూపించాలని వారు గతంలో అనేకసార్లు ఫిర్యాదు చేశారు.
Also Read: Khammam farmers: భూములు కాపాడండి.. లేదంటే చావే గతి.. మంత్రికి రైతులు విజ్ఞప్తి
అధికారులను పలుమార్లు కలిసినా ఫలితం లేదు
తమ 2.26 ఎకరాల భూమికి హద్దులు నిర్వహించాలని మండల, జిల్లా అధికారులను పలుమార్లు కలిసినా ఫలితం లేకపోవడంతో బాధితులు చివరకు హైకోర్టును ఆశ్రయించారు. సర్వే చేసి క్షేత్రస్థాయిలో భూమిని చూపించాలని న్యాయస్థానం అధికారులను ఆదేశించగా, గతంలో జిల్లా సర్వే అధికారులు సర్వే నిర్వహించారు కూడా. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రామదాసు, భారతమ్మ దంపతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
భూమిని అప్పగించే వరకు ఆందోళన చేస్తాం
ప్రధాన ద్వారానికి అడ్డుగా నేలపై పడుకొని తమ భూమిని అప్పగించే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యాలయం అధికారులు వచ్చి, తహసీల్దార్ వచ్చిన వెంటనే సమస్యను వివరిస్తామని నచ్చజెప్పడంతో వారు తమ నిరసనను విరమించారు. ఈ విషయంపై తహసీల్దార్ వీ వెంకటేశ్వర్లును వివరణ కోరగా, కోల్పోయిన 30 గుంటల భూమి గువ్వలగూడెం – ముజ్జిగూడెం రహదారి నిర్మాణంలో కలిసిపోయిందని సర్వేయర్లు నివేదిక అందించారని తెలిపారు.
Also Read: Farmers Protest: వరంగల్ జిల్లాలో.. యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు.. రహదారి పై రాస్తారోకో
