BJP Telangana: అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ.. పార్టీ బలోపేతంపై ఫోకస్
BJP Telangana ( image credit: twitter)
Political News

BJP Telangana: అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ.. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై ఫోకస్

BJP Telangana: తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది. కిందిస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో, ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా సింగిల్‌గానే బరిలోకి దిగబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇతర పార్టీలతో పొత్తుకు ఎలాంటి అవకాశం లేదని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలుమార్లు చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలంటే పార్టీని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేయడం తప్పించి.. మరెలాంటి ఆప్షన్ కనిపించకపోవడంతో సింగిల్‌గానే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎన్నికలకు పునాది వేయాలని ప్రణాళికలు

ఈ నిర్ణయంతో పార్టీ పునాదులు మరింత స్ట్రాంగ్ అవ్వడంతో పాటు అధికారంలోకి కూడా వచ్చినట్లవుతుందనే యోచనలో టీబీజేపీ ఉంది. త్వరలో రాబోయే లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీ క్రమంగా సమాయత్తమవుతున్నది. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో గణనీయమైన పనితీరు కనబరిచిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తమ బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్నది. ఈ ఎన్నికల్లో పార్టీ బలంగా ఉనికిని చాటుకోవడం ద్వారా, భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు పునాది వేయాలని ప్రణాళికలు రచిస్తోంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తున్నది. ‘స్థానిక సంస్థల్లో అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యం’ అనే నినాదంతో ప్రచారం నిర్వహించనున్నారు. కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని ఎండగట్టాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.

Also Read:BJP Telangana: బీజేపీ జిల్లా అధ్యక్షులతో నిత్యం ఫిర్యాదులు.. సంచలన నిర్ణయం తీసుకున్న కమలం ..!

గెలుపునకు వ్యూహాత్మకంగా ప్రణాళిక

సర్పంచ్ నుంచో మొదలుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ వరకు అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేయడం ద్వారా పార్టీ కేడర్‌కు స్పష్టమైన సందేశం ఇవ్వాలని, వారిలో ఆత్మవిశ్వాసం నింపాలని నిర్ణయించారు. జిల్లాల అధ్యక్షులు, స్థానిక కమిటీల సహకారంతో సమన్వయంతో క్షేత్రస్థాయి సమావేశాలు నిర్వహించి గెలుపునకు వ్యూహాత్మకంగా ప్రణాళికను రచించాలని భావిస్తున్నారు. గెలుపు గుర్రాలకే బీ ఫారం అందించి రంగంలోకి దించాలని పార్టీ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించి తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో పడింది.

బీసీలకు అధికంగా సీట్లు దక్కే ఛాన్స్

తెలంగాణలో మొత్తం 12,733 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 5,749 ఎంపీటీసీ, 565 జెడ్పీటీసీ స్థానాల్లో ఏ పార్టీలో పొత్తు లేకుండా అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులనే నిలబెట్టేందుకు పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు పార్టీ తరపున రిజర్వేషన్లు, తగిన ప్రాధాన్యత కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర నేతలు ఇప్పటికే స్పష్టంచేశారు. దీంతో బీసీలకు అధికంగా సీట్లు దక్కే అవకాశాలున్నాయి. స్థానిక సమస్యలను, కేంద్ర ప్రభుత్వ నిధులను వినియోగించుకున్న తీరును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై వ్యవహరించిన తీరును కూడా ఎండగట్టాలని నిర్ణయించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నా పలు జిల్లాల్లో మాత్రం ఎంతో వీక్ గా ఉంది. అలాంటిది తమ లక్ష్యాలను బీజేపీ ఎలా అధిగమిస్తుందనేది చూడాలి.

Also ReadBJP Telangana: కాసేపట్లో బీజేపీ మహాధర్నా.. ధర్నాచౌక్ వేదికగా నిరసన.. ఎందుకంటే?

Just In

01

Bowrampet Land Dispute: బౌరంపేట్‌లో బడాబాబుల భూ మాయ‌.. పెద్దలకు వత్తాసు పలుకుతున్న మున్సిపాలిటీ రెవెన్యూ?

Trivikram Venkatesh: వెంకీమామ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా టైటిల్ ఇదే!

Minister Sridhar Babu: తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో మహిళల కీలక పాత్ర : మంత్రి శ్రీధర్

Rumour Controversy: వారి బ్రేకప్‌ వ్యవహారంలో తనకు సంబంధం లేదంటున్న కొరియోగ్రాఫర్ నందికా ద్వివేది..

Chamal Kiran Kumar Reddy: ట్రిపుల్ఆర్ మూసీ రీజువెనేషన్ కు కేంద్రం సహకరించాలి : ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి