Environment: పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మానవాళి మనుగడ, భవిష్యత్తు ఉంటుందని తెలంగాణ అటవీ శాఖ ప్రధాన సంరక్షణ అధికారి సువర్ణ(Suvarna) అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం కేంద్రంలోని అటవి కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్.సీ.ఆర్.ఐ)లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, తెలంగాణ ఉన్నత విద్యా మండలి, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సౌజన్యంతో పర్యావరణం మరియు వ్యర్థాల నిర్వహణ – సమస్యలు, ప్రభావాలు, సవాళ్లు అవకాశాలు అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు.
ప్రమాదంలో భవిష్యత్తు
ఈ సందర్భంగా సువర్ణ మాట్లాడుతూ పట్టణీకరణ, నగరీకరణ వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది, వ్యర్థాలు పేరుకు పోతున్నాయన్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలంగాణ అటవీ సంరక్షణ అధికారి డా.ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. వ్యర్థాల నిర్వహణ మన స్వంత ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నారు. ప్రతి ఒక్కరూ రెడ్యూస్-రీయూజ్-రీసైకిల్ అనే నినాదాన్ని పాటిస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ తీసుకోవాలని పిలుపునిచ్చారు.
వ్యర్థాల నుంచి సంపద సృష్టి
ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డా.డి.రాజిరెడ్డి(Dr Rajireddy) మాట్లాడుతూ తెలంగాణ(Telangana) ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్-2047 సిద్ధం చేస్తున తరుణంలో ఇలాంటి సదస్సు నిర్వహించడం పర్యావరణానికి గొప్ప మేలు చేస్తుందన్నారు. వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే పద్ధతులు కనిపెట్టి, కొత్త తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి పర్యావరణాన్ని కాపాడే బాధ్యత యువత, పరిశోధకులు, విద్యార్థులు తీసుకోవాలన్నారు. ఈ సదస్సులో కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, సదస్సు కార్యనిర్వాహక కార్యదర్శి డా.ఎన్.ఎస్.శ్రీనిధి, కళాశాల అధ్యాపకులు ప్రొ.మమత, డా.శ్రీధర్, డా.రీజా, డా.శాలిని, డా.చిరంజీవి, డా.ప్రియా, డా. జగదీష్, డా. నికిత, డా. అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Suryapet District: ఆపరేషన్ కగార్‌ను రద్దు చేయాలి.. వామపక్షాలు, ప్రజా సంఘాల నిరసన!

