Thummala Nageswara Rao: నేత కార్మికుల రుణమాఫీ కోసం రూ.33 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని నేత కార్మికులకు రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఆ హామీ ప్రకారం నిధులు విడుదల చేసిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నేత కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకురావడంతో పాటు, పునరుద్ధరించడం జరిగిందన్నారు. ప్రజా ప్రభుత్వ నిర్ణయాలతో నేత కార్మికులకు నిరంతర ఉపాధి లభిస్తోందని, అందులో భాగంగా టెస్కోకు రూ.588 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయన్నారు.
ప్రభుత్వం రూ.168 కోట్లతో తెలంగాణ చేనేత అభయహస్తం
నేత కార్మికులకు 365 రోజులు ఉపాధి కల్పించడమే తమ ప్రధాన ధ్యేయమన్నారు. సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, హన్మకొండ జిల్లాల్లోని 130 మాక్స్, 56 ఎస్ఎస్ఐ యూనిట్ల ద్వారా ఇందిరా మహిళా శక్తి పథకం కింద సహాయక సంఘాల మహిళా సభ్యులకు అందించే చీరల ఉత్పత్తి జరిగిందని, నాణ్యమైన చీరలు అందిస్తున్నామని వివరించారు.నేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.168 కోట్లతో తెలంగాణ చేనేత అభయహస్తం పథకంలో భాగంగా మూడు ముఖ్యమైన పథకాలను అమలు చేస్తోందని వివరించారు. వేములవాడలో రూ.50 కోట్లతో యార్న్ డిపో ఏర్పాటుచేశామన్నారు. రాష్ట్రంలోని నేత కార్మికుల పిల్లలకు ఆధునిక సాంకేతిక విద్యను అందించేందుకు కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేసి మూడేళ్ల డిప్లొమా కోర్సులు అందిస్తున్నామన్నారు.
