– ట్యాపింగ్ కేసు నిందితులకు దక్కని ఊరట
– ఈ దశలో బెయిల్ ఇవ్వలేమన్న కోర్టు
– 3 బాక్సుల్లో కోర్టుకు చేరిన సాక్ష్యాలు
Telangana: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో కీలక నిందితులైన నిందితులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్‌రావు బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. ఈ మేరకు నిందితులకు బెయిల్ పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. కేసు విచారణలో భాగంగా తాము 3 నెలల నుంచి జ్యుడీషియల్ రిమాండులో ఉన్నామనీ, అయితే, దర్యాప్తు అధికారులు ఈ కేసులో తమపై చార్జిషీటు నమోదు చేయనందున, తమకు బెయిల్ ఇవ్వాలని నిందితులు భుజంగరావు, తిరపతన్న, ప్రణీత్ రావు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
కాగా, విచారణ సక్రమంగా జరుగుతున్న వేళ, కీలక నిందితులకు బెయిల్ మంజూరు చేయటం సరికాదనీ, వారు బయట ఉంటే, దర్యాప్తుకు ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని ప్రభుత్వ న్యాయవాది కోర్టు ముందు తన వాదనలు వినిపించారు. ఆయన వాదనను ఏకీభవించిన నాంపల్లి కోర్టు నిందితుల బెయిల్ పిటీషన్లను కొట్టివేసింది. కాగా ఈ కేసులో సమగ్ర సాక్షాలను పోలీసు ఉన్నతాధికారులు మొత్తం మూడు బాక్సుల్లో కోర్టుకు సమర్పించారు. ఇందులో హార్డ్ డిస్క్‌లు, సీడీ, పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయి.