Local Body Elections: 3 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు
తద్వాారా బందోబస్తు సులభతరం అవుతుంది
ప్రతిపాదించిన డీజీపీ శివధర్ రెడ్డి
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: స్థానిక సంస్థల ఎన్నికలను (Local Body Elections) మూడు విడతలుగా నిర్వహిస్తే శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే వెసులుబాటు దక్కుతుందని డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) ప్రతిపాదించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులు పాల్గొన్న ఈ వీడియో సమావేశంలో గత ఎన్నికల అనుభవాల నేపథ్యంలో ఈసారి మూడు దఫాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డీజీపీ ప్రతిపాదించారు. ఒక ప్రాంతంలో ఎన్నికలు పూర్తయిన తరువాత మరో ప్రాంతంలో ఎలక్షన్లు జరపటానికి కనీసం రెండు రోజుల వ్యవధి ఉండేలా చూడాలన్నారు. ఈ విరామంతో భద్రతా బలగాలు, సిబ్బందికి తగిన సమయం లభిస్తుందని, తద్వారా బందోబస్తును మరింత సమర్థవంతంగా నిర్వహించే వీలు కలుగుతుందని చెప్పారు.
Read Also- Question paper leak Case: ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్
సర్పంచ్ ఎన్నికలు పూర్తయిన రోజునే సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తున్న నేపథ్యంలో గెలిచినవారు ర్యాలీలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయన్నారు. అందుకే రెండు రోజుల విరామం అవసరమని అభిప్రాయ పడ్డారు. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని డీజీపీ శివధర్ రెడి చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తామన్నారు. అసాంఘిక శక్తులు, అనుమనాస్పద వ్యక్తులపై కట్టుదిట్టమైన నిఘా పెడతామని చెప్పారు.
డీజీపీ సూచనల అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, నిష్పక్షపాతంగా ముగిసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీని కోసం రాష్ట్ర స్థాయి రివ్యూ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు డీజీపీ మహేశ్ భగవత్, మల్టీజోన్ 2 అదనపు డీజీపీ డీ.ఎస్.చౌహాన్, మల్టీజోన్ 1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, శాంతిభద్రతల ఏఐజీ రమణకుమార తదితరులు పాల్గొన్నారు.
