Question paper leak Case:
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు హైకోర్టులో గురువారం భారీ ఊరట దక్కింది. 10వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీకి (Question paper leak Case) సంబంధించి ఆయనపై హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేస్తున్నట్టుగా తెలిపింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2023లో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో హిందీ సబ్జెక్ట్ ప్రశ్నాపత్రం లీకైన విషయం తెలిసిందే. దీంట్లో బండి సంజయ్ ప్రమేయం ఉందంటూ కమలాపూర్ పోలీసులు ఆయనపై ఐపీసీ 120బీ, 420, 447, 505(1)(బీ), తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టిసెస్ యాక్ట్‌లోని సెక్షన్ 4(ఏ), 6 రెడ్ విత్ 8, ఐటీ యాక్ట్ సెక్షన్ 66డీ ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో బండి సంజయ్‌ను అరెస్ట్ కూడా చేశారు.
మరుసటి రోజు తన అత్త కర్మకాండ కార్యాలు ఉన్నాయని, వాటికి హాజరు కావాల్సి ఉన్నదంటూ బండి సంజయ్ చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. బండి సంజయ్‌ని అదుపులోకి తీసుకుని అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లోని వేర్వేరు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. చివరకు బొమ్మల రామారం పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. దీనిపై అప్పట్లో బీజేపీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కూడా వ్యక్తం చేశారు. ఇక, బండి సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, రాజకీయ కక్షలతోనే తనపై ఈ కేసులు పెట్టారని, వాటిని కొట్టివేయాలంటూ కొంతకాలం క్రితం హైకోర్టులో బండి సంజయ్ పిటిషన్ దాఖలు చేశారు. పరీక్ష ఉదయం జరిగితే అర్ధరాత్రి తనపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీతో బండి సంజయ్‌కి సంబంధం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ ఆయనపై నమోదు చేసిన కేసులను కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.
Read Also- KTR – High Court: హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట.. 2023 నాటి కేసు కొట్టివేత
ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరు…
ఇదిలావుంచితే, కేంద్ర మంత్రి బండి సంజయ్ గురువారం నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. గతంలో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నల్గొండ జిల్లాలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ఆ సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. దాంతోపాటు హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్లలో బండి సంజయ్ కాన్వాయ్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడి కూడా చేశారు. ఈ ఘటనలకు సంబంధించి బండి సంజయ్‌పై మూడు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వీటి విచారణ నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో జరుగుతోంది. ఈ క్రమంలోనే గురువారం బండి సంజయ్ విచారణకు హాజరయ్యారు. కాగా, ఈ కేసుల్లో విచారణను జనవరి 7కి వాయిదా వేస్తూ జడ్జి నిర్ణయం తీసుకున్నారు.
