Kashmir Times: దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘కశ్మీర్ టైమ్స్’ (Kashmir Times Paper) పత్రిక కార్యాలయంలో పోలీసులు గురువారం సోదాలు నిర్వహించారు. జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) ఎస్ఐఏ (స్టేట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ) అధికారులు న్యూస్ పేపర్ ఆఫీస్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో ఏకే రైఫిల్స్ కాట్రిడ్జ్‌లు, పిస్టల్స్, హ్యాండ్ గ్రెనేడ్ పిన్‌లు దొరికాయి. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పురిగొల్పుతున్నట్టుగా ఆరోపణలు ఉండడంతో ఈ పత్రిక తోపాటు ప్రమోటర్లపై కేసు నమోదు చేసి, ఈ తనిఖీలు చేపట్టామని అధికారులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా పత్రిక ఆఫీస్‌లోని కంప్యూటర్లతో పాటు అన్నింటినీ పరిశీలించామని అధికారులు మీడియాకు తెలిపారు. ఏకై రైఫిల్స్ కాట్రిడ్జ్‌లు, హ్యాండ్ గ్రెనేడ్ పిన్‌లు గుర్తించిన నేపథ్యంలో, త్వరలోనే పత్రిక ప్రమోటర్లను ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాశ్మీర్ టైమ్స్ కార్యాలయంలో పోలీసుల సోదాలపై డిప్యూటీ సీఎం సురీందర్ సింగ్ చౌదరి (Surinder Singh Choudary) స్పందించారు. తప్పు జరిగినట్టుగా నిరూపణ అయిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకోవాలని అన్నారు. పత్రికా ప్రమోటర్లు ఏదైనా తప్పు చేస్తే చర్య తీసుకోవాలని, కేవలం ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలా చేస్తే వ్యవహరిస్తే మాత్రం తప్పు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడారు.
Read Also- Hidma Funerals: ఒకే చితిపై హిడ్మా దంపతులు.. అంత్యక్రియలకు పోటెత్తిన ప్రజలు.. ఆదరణ చూసి షాకైన బలగాలు!
పత్రికా స్వేచ్ఛపై దాడి
కశ్మీర్ టైమ్స్ కార్యాలయంలో పోలీసుల సోదాలపై పత్రిక ఎడిటర్లు అనురాధ భాసిన్ జమ్వాల్ (Anuradha Bhasin), ప్రబోధ్ జమ్వాల్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, పత్రికా స్వేచ్ఛపై దాడిగా ఇరువురూ అభివర్ణించారు. స్వతంత్ర జర్నలిజాన్ని అణచివేసేందుకు చేసిన ప్రయత్నమని వారు అభివర్ణించారు. ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే, రాష్ట్రానికి శత్రుత్వం వహిస్తున్నామని అర్థం కాదని వ్యాఖ్యానించారు. బలంగా ప్రశ్నించే పత్రిక ప్రజాస్వామ్యానికి చాలా అవసరమని, తమపై చేస్తున్న ఆరోపణలు కేవలం భయపెట్టడానికి, తమను నిశ్శబ్దం చేసేందుకేనని, కానీ, తాము మాత్రం నిశ్శబ్దం కాబోమని పత్రిక ఎడిటర్లు అనురాధ భాసిన్ జమ్వాల్, ప్రబోధ్ జమ్వాల్ ప్రకటనలో పేర్కొన్నారు. తమపై ఆరోపణలను వెన్కి తసుకోవాలని, వేధింపులను ఆపివేయాలంటూ విజ్ఞప్తి చేశారు. మీడియా సహచరులు, పౌర సమాజం, పౌరులు తమకు మద్దతుగా నిలవాలని కోరారు. జర్నలిజం నేరం కాదని, తమపై సోదాలు నిర్వహించినప్పటికీ నిజాన్ని వెలికితీసే తమ నిబద్ధత కొనసాగుతుందని స్పష్టం చేశారు.
గతం నుంచే ఆరోపణలు
సీనియర్ జర్నలిస్ట్ వేద్ భాసిన్ (Ved Bhasin) 1954లో ‘కాశ్మీర్ టైమ్స్’ పత్రికను స్థాపించారు. అయితే, వేర్పాటువాదులకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఈ పత్రికపై తొలి నుంచీ ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా, పాకిస్థాన్ ఐఎస్ఐ నిధులతో ఓ వేర్పాటువాది అమెరికాలో ఏర్పాటు చేసిన సెమినార్‌లో కశ్మీర్ టైమ్స్ పత్రిక వ్యవస్థాపకుడు వేద్ భాసిన్ పాల్గొనడం తీవ్ర వివాదాస్పదం అయ్యింది. దీంతో, పత్రికపై భారత వ్యతిరేక ఆరోపణలు మరింత పెరిగాయి. అయితే, వేద్ భాసిన్ చనిపోయిన తర్వాత, ఆయన కూతురు అనురాధ భాసిన్ జమ్వాల్, ఆమె భర్త ప్రబోధ్ జమ్వాల్ నిర్వహణ బాధ్యతల తీసుకున్నారు. ఇరువురూ ఎడిటోరియల్ బాధ్యతలను తీసుకున్నారు. అయితే, వీరిద్దరూ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఇక, 2021-22 నుంచి ఈ పత్రిక ప్రింటింగ్ నిలిపివేశారు. కేవలం ఆన్‌లైన్ ఎడిషన్ మాత్రం ఇస్తున్నారు.

