Yash mother complaint: కన్నడ స్టార్ హీరో యష్ కుటుంబం మరోసారి వార్తల్లో నిలిచింది. యష్ తల్లి, చిత్ర నిర్మాత పుష్ప ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కర్ణాటక పోలీసులు ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బెదిరింపులు, బ్లాక్‌మెయిల్, అలాగే సినిమా పబ్లిసిటీ కోసం తీసుకున్న డబ్బును దుర్వినియోగం చేసినట్టు ఆమె ఆరోపించారు. బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఈ కేసు నమోదు అయ్యింది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో PRO హరీష్ ఉర్స్, మను, నితిన్, మహేష్ గురు, స్వర్ణలత అనే ఐదుగురు ఉన్నారు.
సినిమా పబ్లిసిటీకే డబ్బు తీసుకుని… వ్యతిరేక ప్రచారం చేశారంటూ ఆరోపణ
పుష్ప నిర్మించిన ‘కొట్టలవాడి’ సినిమాకు పబ్లిసిటీ కోసం హరీష్ ఉర్స్ టీం మొత్తం రూ.64 లక్షలు తీసుకున్నారని కానీ, సినిమా ప్రమోషన్ చేయడానికి బదులుగా దానిని డీ-ప్రమోట్ చేసే పనులే చేశారని పుష్ప ఆరోపించారు.
ఆమె మీడియాతో ఏం చెప్పారంటే?
“ సినిమా ప్రమోషన్ కోసం మొదట్లో హరీష్ ఉర్స్ రూ. 23 లక్షలకు పబ్లిసిటీ చూస్తానని ఒప్పుకున్నాడు. షూటింగ్ సమయంలో కూడా అదనంగా డబ్బు తీసుకున్నాడు. సినిమా రిలీజ్‌కి రెడీ అయ్యాక అకౌంట్స్ అడిగితే సినిమా డీ-ప్రమోట్ చేస్తానని డైరెక్టర్‌ను బెదిరించాడు.” ఆమె ఇంకా మాట్లాడుతూ.. “ షూటింగ్ పూర్తయ్యాక అకౌంట్స్ అడిగినా మళ్లీ బెదిరింపులు మొదలుపెట్టారు. బ్లాక్‌మెయిల్ చేయడానికి కూడా ప్రయత్నించారు. అందుకే కోర్టు పర్మిషన్ తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాం.” అని ఆమె తెలిపింది.
“ నెగటివ్ న్యూస్ పెడతాం ” అని బెదిరింపులు
పుష్ప తెలిపిన వివరాల ప్రకారం, ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వర్ణలత, గురు ఇద్దరూ తమకు మీడియా కనెక్షన్స్ ఉన్నాయని, డైరెక్టర్‌పై, నిర్మాతపై నెగటివ్ స్టోరీలు రాస్తామని బెదిరించారని తెలిపారు. “మా దగ్గరున్న అన్ని ప్రూఫ్‌లను పోలీసులకు ఇచ్చాం. సినిమా చాంబర్, పీఆర్ అసోసియేషన్‌కు కూడా వివరాలు తెలిపాం. మేము సెలబ్రిటీ కుటుంబం కావడంతో అనవసర ఇష్యూలు రావద్దని భావించి పోలీసులను ఆశ్రయించాం.” అని తెలిపారు.
సినిమా రిలీజ్‌కి వారం ముందు బ్లాక్‌మెయిల్ మొదలు పెట్టారు
పుష్ప చెప్పినదాని ప్రకారం.. సినిమా విడుదలకు ఒక వారం ముందు నుంచే బ్లాక్‌మెయిల్ మొదలు పెట్టారు. ఇప్పటి వరకు రూ.64 లక్షల ఖర్చులకు సంబంధించిన ఏ అకౌంట్‌లూ ఇవ్వలేదని ఆరోపించారు. హరీష్ సహచరులు “యష్ ఫ్యామిలీ నుంచి డబ్బు రాలేదని” అబద్ధపు ప్రచారం చేశారని చెప్పారు. సినిమా రిలీజ్ అయిన రోజే సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం మొదలైందని తెలిపారు. “ఇంకా చాలా మందిని ఇలాగే మోసం చేశారని వినిపిస్తోంది. కానీ వాళ్లు బయటకు రావడానికి భయపడుతున్నారు” అని పుష్ప అన్నారు.

