Kajol: బాలీవుడ్ నటి కాజోల్ ముంబైలోని తన కమర్షియల్ ప్రాపర్టీని అద్దెకు ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది. రూ.8.6 కోట్ల మొత్తం లీజ్ విలువతో, నెలసరి అద్దెను రూ.6.9 లక్షలుగా ఫిక్స్ చేస్తూ ఈ డీల్‌ను 2025 నవంబర్‌లో అధికారికంగా రిజిస్టర్ చేశారు. తొమ్మిదేళ్ల కాలపరిమితితో కుదిరిన ఈ ఒప్పందం ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో హాట్ టాపిక్ గా మారింది.
కాజోల్ ముంబైలోని ప్రాపర్టీని అద్దెకు ఇచ్చింది.. నెలకు రెంట్ రూ.6.9 లక్షలు
స్క్వేర్ యార్డ్స్ పరిశీలించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం, మొదటి మూడు సంవత్సరాలు అద్దె రూ.6.9 లక్షలుగానే ఉండగా, ప్రతి మూడు ఏళ్లకు ఒకసారి 15% పెంపు వర్తించబడుతుంది. నాలుగు నుంచి ఆరేళ్ళ వరకు నెలసరి అద్దె రూ.7.9 లక్షలకు పెరుగుతుంది. ఏడో సంవత్సరం నుంచి తొమ్మిదో సంవత్సరం వరకు మరోసారి పెరిగి రూ.9.13 లక్షలకు చేరుతుంది. ఈ మొత్తం వ్యవధిలో కాజోల్ పొందబోయే అద్దె మొత్తం రూ.8.6 కోట్లకు సమానం అవుతుంది.
కాజోల్ అద్దెకు ఇచ్చిన ఈ ప్రాపర్టీ గోరేగావ్ వెస్ట్‌లోని భారత్ అరైజ్ కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఉంది. 1,817 చదరపు అడుగుల (సుమారు 168 చదరపు మీటర్లు) కార్పెట్ ఏరియాతో పాటు ఒక కార్ పార్కింగ్ సదుపాయాన్ని కలిగి ఉన్న ఈ ఆఫీస్ స్పేస్, అంధేరి, మలాడ్, ఓషివారా డిస్ట్రిక్ట్ సెంటర్ (ODC) వంటి కీలక బిజినెస్ హబ్‌లకు దగ్గరగా ఉండటం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ డీల్‌లో భాగంగా రూ.5.61 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు, అలాగే రూ.27.61 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించబడినట్లు రికార్డులు చూపిస్తున్నాయి.
భర్తను ఫాలో అవుతున్న కాజోల్!
ఇది మొదటిసారి కాదు. ఇదే తరహాలో గతంలో అజయ్ దేవగన్ కూడా ముంబై అంధేరీలో 3,455 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను నెలకు రూ.7 లక్షలకు అద్దెకు ఇచ్చినట్లు 2024 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చెప్పాయి. దీంతో, దేవగన్ దంపతులు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు బలంగా అడుగులు వేస్తున్నారన్న అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ఇప్పటికే సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చిన కాజోల్, ప్రస్తుతం OTT వైపు దృష్టి పెట్టింది. ట్వింకిల్ ఖన్నాతో కలిసి ఆమె హోస్ట్ చేస్తున్న “Too Much With Kajol and Twinkle” షో కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక పక్క ఎంటర్టైన్‌మెంట్ రంగంలో బిజీగా ఉంటూనే, మరో పక్క రియల్ ఎస్టేట్ ఇన్‌కమ్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకోవడం కాజోల్ తెలివైన ఆర్థిక నిర్ణయంగా చెబుతున్నారు నిపుణులు.

