Damodar Raja Narasimha: తెలంగాణలో వైద్యారోగ్య సేవలను మెరుగుపరచడంలో డీఎంహెచ్‌వోలు మరింత యాక్టివ్‌గా పనిచేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. బుధవారం జనరల్ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లతో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనేక కీలక అంశాలపై ఆదేశాలు జారీ చేశారు. ట్రీట్‌మెంట్ పేరిట ప్రజలను దోచుకునే ప్రైవేట్ హాస్పిటళ్లపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మంత్రి నొక్కి చెప్పారు. ఐవీఎఫ్ సెంటర్లు, పెయిన్ క్లినిక్‌లు, రిహాబిలిటేషన్ సెంటర్ల పేరిట దోపిడీకి, అవకతవకలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ‘పోలీసులను చూడగానే నేరస్తులు భయపడినట్టు, వైద్యాధికారులను చూస్తే నిబంధనలు ఉల్లంఘించే హాస్పిటళ్ల యాజమాన్యాలు భయపడాలి’ అని మంత్రి స్పష్టం చేశారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌ను పకడ్బంధీగా అమలు చేయాల్సిందేనని ఆదేశాలిచ్చారు. అలాగే, మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య విధాన పరిషత్, పబ్లిక్ హెల్త్, ఎన్‌హెచ్‌ఎం డిపార్ట్‌మెంట్ల మధ్య సమన్వయం కోసం ఎక్కడికక్కడ సమన్వయ కమిటీలను నియమించుకుని పనిచేయాలని సూచించారు.
అటెండెన్స్ మానిటరింగ్
డీఎంహెచ్‌వోలు, సూపరింటెండెంట్ల అటెండెన్స్ మానిటరింగ్ జరుగుతుందని, నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టమని మంత్రి హెచ్చరించారు. ప్రభుత్వాసుపత్రులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. గత ప్రభుత్వం తరహాలో అరకొర బిల్డింగులు కట్టి వదిలేయడం లేదని, ప్రతి హాస్పిటల్‌లోనూ అవసరమైన సిబ్బందిని నియమిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 9 వేలకుపైగా పోస్టులు భర్తీ చేశామని, మరో 7 వేలకుపైగా పోస్టులు భర్తీ అవుతున్నాయని మంత్రి వెల్లడించారు. హాస్పిటళ్లలో పాతుకుపోయి వార్తలు రాయించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రతి నెల ఆడిట్‌లు, యాక్షన్ టేకెన్‌లు జరుగుతాయన్నారు. వృద్ధాప్యంలో వచ్చే మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్‌లో జెరియాట్రిక్ సేవలను విస్తరించాలని మంత్రి ఉన్నతాధికారులకు సూచించారు. జీవన ప్రమాణాలు పెరిగిన నేపథ్యంలో వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోందని, జపాన్, ఇటలీ తరహాలో వృద్ధుల కోసం ప్రత్యేక హాస్పిటళ్లు నిర్వహించాల్సిన అవసరం భవిష్యత్తులో మన దేశంలోనూ ఏర్పడుతుందన్నారు.
నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలి
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధుల జాబితాలు సిద్ధం చేసుకుని, వారికి ప్రభుత్వ హాస్పిటళ్లలో ఉచిత వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత డీఎంహెచ్‌వోలదేనని మంత్రి ఆదేశించారు. ప్రతి జీజీహెచ్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లో జెరియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేశామన్న విషయాన్ని ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎన్‌సీడీ క్లినిక్‌లు, క్యాన్సర్ కేర్ సెంటర్‌ల తరహాలోనే ఈ కేంద్రాలు కూడా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. కొన్ని జిల్లాల్లో సిజేరియన్ డెలివరీలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని తగ్గించి నార్మల్ డెలివరీలను ప్రోత్సహించే ప్రయత్నం చేయండని మంత్రి సూచించారు. సిజేరియన్ డెలివరీలు మాత్రమే చేస్తున్న హాస్పిటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ హాస్పిటల్స్ నుంచి పేషెంట్లను బయటకు రిఫర్ చేయొద్దని ఆదేశించారు. సబ్ సెంటర్ నుంచి జీజీహెచ్‌ల వరకు అన్ని హాస్పిటళ్ల నడుమ సమన్వయం ఉండాలని, అవసరమైనప్పుడు మరో ప్రభుత్వ హాస్పిటల్‌కు మాత్రమే రిఫర్ చేయాలని ఆదేశించారు.
Also Read: Damodar Raja Narasimha: రైతులకు మద్దతు ధరతోపాటు సన్నాలకు బోనస్ : మంత్రి దామోదర్ రాజనర్సింహ

