Raju Weds Rambai: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రమోషన్లు, పబ్లిసిటీ కోసం రకరకాల ట్రిక్స్‌ను దర్శకులు, నిర్మాతలు ఉపయోగిస్తుంటారు. అయితే, ఇటీవల చిన్న సినిమాగా వస్తున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకలో ఆ సినిమా దర్శకుడు చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. సినిమా పట్ల తనకున్న అపారమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, ఒక ధైర్యమైన, విచిత్రమైన ఛాలెంజ్‌ను ఆయన మీడియా ముందు ప్రకటించారు. దర్శకుడు సాయిలు కంపాటి మాట్లాడుతూ.. ఈ సినిమా ఒక పల్లెటూరులో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించినట్లు, కథా కథనాలు ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటాయని దృఢంగా చెప్పారు. ఒక దర్శకుడిగా తాను ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించానని, ఈ సినిమా కచ్చితంగా విజయవంతం అవుతుందన్న నమ్మకం తనకు ఉందని స్పష్టం చేశారు. అయితే, తన నమ్మకాన్ని నిరూపించుకోవడానికి ఆయన ఎంచుకున్న మార్గం మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉంది. “నా సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది. ఒకవేళ, విడుదలైన తర్వాత మా సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే, నేను హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ సెంటర్‌లో అండర్‌వేర్‌తో తిరుగుతాను” అంటూ బహిరంగంగా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
సాయిలు కంపాటి అంతటి ధైర్యంతో ఆ ఛాలెంజ్‌ను ఎందుకు విసిరారనే చర్చ సినీ వర్గాలలో జరిగింది. కొందరు ఆయన ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుంటే, మరికొందరు పబ్లిసిటీ స్టంట్ కోసం అతిగా మాట్లాడారని విమర్శించారు. ఏదేమైనా, సినిమా పట్ల దర్శకుడికి ఉన్న కమిట్‌మెంట్, అది ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందన్న ఆయన దృఢమైన నమ్మకం ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న ప్రధాన కారణాలుగా భావించవచ్చు. ఆ ఛాలెంజ్ వల్ల ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా పేరు ఒక్కసారిగా సినీ ప్రియుల మధ్య చర్చనీయాంశమైంది. ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే దర్శకుడు నిజంగానే ఛాలెంజ్ పూర్తి చేస్తారా అనే ఉత్సుకత సినీ అభిమానుల్లో నెలకొంది. ఈ రకమైన సంచలన వ్యాఖ్యలు సినిమాకు మరింత పబ్లిసిటీని తెచ్చిపెట్టాయి అనడంలో సందేహం లేదు.
Read also-Chiranjeevi: ‘కొదమసింహం’ రీ రిలీజ్.. రామ్ చరణ్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన మెగాస్టార్!
అయితే ఈ సినిమాపై నిర్మాతలతో సహా మూవీ టీం మొత్తం ఎంతో నమ్మకంతో ఉంది. ఈ సినిమాకు సంబంధించి టికెట్లు రేట్లను కూడా తగ్గించారు నిర్మాతలు. ఈ సినిమా సింగిల్ స్క్రీన్ థియోటర్లో రూ. 99 గానూ మల్టీఫెక్స్ థియోటర్లలో రూ.105 రూపాయలు గానూ తగ్గించారు. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో కథ అందరికీ చేరువవ్వలనే ఆశయంతో దర్శక, నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 21 తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే మరి.
