The Great Pre-Wedding Show: వెర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన నూతన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లో ఈ చిన్న చిత్రం సాధించిన విజయం నిజంగా అరుదైన మైలురాయిగా నిలుస్తోంది. సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు. తొలి ఆట నుంచే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, బలమైన మౌత్ టాక్‌తో ప్రేక్షకుల ఆదరణను బలంగా రాబట్టుకుంటోంది.
Read also-Varanasi: సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ‘వారణాసి’ కథాంశం.. అదే అయితే గ్లోబల్ హిట్టే..
ఈ చిత్రం కథాంశం చాలా సింపుల్‌గా, ఆశ్చర్యకరంగా ఉంటుంది. చిన్న పట్నంలో ఉండే రమేష్ అనే ఫొటోగ్రాఫర్, ఒక ప్రీ-వెడ్డింగ్ షూటింగ్ చేసిన సమయంలో మెమొరీ కార్డుని కోల్పోవటం వలన ఏర్పడే గందరగోళమైన పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. మన రోజువారీ జీవితంలో మన చుట్టూ ఉండే వ్యక్తులలో కనిపించే కామెడీ, ఆప్యాయత వంటి భావోద్వేగాలను అతిశయోక్తి లేకుండా, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు చిత్రీకరించారు. సన్నివేశాల్లోని కామెడీ, గ్రామీణ ప్రాంత ప్రజల ప్రవర్తన, మాట తీరును సహజంగా చూపించడం ఈ సినిమాకు ప్రధాన బలం. కమర్షియల్ హంగుల కోసం కాకుండా, మనిషి జీవితాల్లోని డ్రామా, కామెడీ, భావోద్వేగాల్లోని నిజాయతీ కలయికగా ఈ సినిమా రూపొందింది. ఏదో మిస్ అవుతున్నామని భావించే ప్రేక్షకులు కోరుకునే సహజమైన అనుభూతిని ఈ చిత్రం విజయవంతంగా అందించింది.
Read also-Divya Bharathi: ‘గోట్’ దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేసిన హీరోయిన్.. సుడిగాలి సుధీర్ ఏం చేశాడంటే?
‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’కు ఓవర్‌సీస్‌లో లభిస్తున్న స్పందన నిజంగా ప్రశంసనీయం. అథర్వణ భద్రకాళి పిక్చర్స్ ఈ చిత్రాన్ని ఓవర్‌సీస్‌లో విడుదల చేశారు. వారి ప్లానింగ్, మార్కెట్ రీచ్ కారణంగా, ఈ చిన్న చిత్రం అమెరికా, కెనడాల్లోని ప్రేక్షకులకు విజయవంతంగా చేరింది. నార్త్ అమెరికాలో ఒక చిన్న చిత్రం సాధించిన అరుదైన మైల్ స్టోన్ ఇది. భారీ స్పెషల్ ఎఫెక్ట్స్, భారీతనం లేకపోయినా, ఒక నిజాయతీతో కూడిన మంచి కథ ఉంటే చాలు – ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని ఈ సినిమా మరోసారి నిరూపించింది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం ప్రేక్షకుల ఆదరణను కూడా పొందుతూ ఓవర్‌సీస్‌లో విజయవంతంగా రన్ అవుతూ మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. ఈ సినిమా నార్త్ అమెరికా ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయింది అనడంలో సందేహం లేదు.
